బయ్యారం, జనవరి 28: రాష్ట్ర విభజన చట్టంలోని హామీమేరకు మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటనను నిరసిస్తూ బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్, మహబుబాబాద్, ఇల్లందు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏడేండ్లు గడుస్తున్నా బీజేపీ ప్రభుత్వం ఉక్కుపరిశ్రమ ఊసెత్తకపోవడం శోచనీయమన్నారు. పరిశ్రమ ఏర్పాటు చేయలేని బీజేపీ నాయకులకు బయ్యారంలో అగుడుపెట్టే అర్హత లేదని ధ్వజమెత్తారు. ధర్నా నిర్వహించిన ఎంపీటీసీ సోమేశ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్‌నాయక్, వెంకటపతి, ప్రవీణ్ నాయక్, మంగిలాల్, సుమన్, కిరణ్‌రెడ్డి, శ్రీను, రాకేశ్‌లను పోలీసులు అరెస్ట్‌చేసి గార్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బయ్యారం, ఉప్పలపాడు గ్రామాల్లో పర్యటిస్తున్న ఈటల రాజేందర్‌కు నిరసన సెగ తగిలింది. బయ్యారంలో టీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేయగా, ఉప్పలపాడులో కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కి రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఈటల గోబ్యాక్ .. మోదీ డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి మహబుబాబాద్ స్టేషన్‌కు తరలించారు.