క్రెడిట్ కార్డ్.. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నదే. అయితే దీన్ని సవ్యంగా వాడినంత వరకు ఎలాంటి సమస్యలు ఉండవు. అదుపు తప్పితే మాత్రం అనర్థాలే. క్రెడిట్ కార్డ్ వినియోగంతో వెంటనే చేతి నుంచి డబ్బు ఖర్చవకపోయినా.. నెలలోపు ఆ మొత్తాన్ని తీర్చకపోతే చక్రవడ్డీతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. ముఖ్యంగా వడ్డీ రహిత వ్యవధిలో ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించక, కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తూ క్రెడిట్ రోలింగ్ చేయడం వల్ల ఎన్నటికీ ఆ క్రెడిట్ కార్డ్ అప్పు తీరదు. ఏటా 48 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలా క్రెడిట్ కార్డ్ రుణ ఊబిలో చిక్కుకోకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులను పాటించాల్సిందే. సక్రమంగా వినియోగిస్తే క్రెడిట్ కార్డంత ఉపయోగకరమైన సాధనం మరొకటి లేదు. క్రెడిట్ కార్డ్‌ను విచక్షణతో ఉపయోగించడానికి, తక్కువ వడ్డీతో లేదా అసలే వడ్డీ చెల్లించకుండా వాడాలంటే కొన్ని మార్గాలున్నాయి.
క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన ఖర్చును నెలసరి స్టేట్మెంట్ రాగానే, ఇంట్రస్ట్ ఫ్రీ గడువులోపు మొత్తంగా చెల్లించేయడం మంచిది. స్టేట్మెంట్ తేదీ నుంచి చెల్లించడానికి సాధారణంగా 15 రోజుల గడువు ఉంటుంది. అయితే స్టేట్మెంట్ తేదీకి ముందు రోజునే కొనుగోలు చేస్తే చెల్లింపులకు కేవలం 15 రోజుల గడువే ఉంటుంది. స్టేట్మెంట్ తేదీ తర్వాత మొదటి రోజున కొనుగోలు చేస్తే 45 రోజుల వరకు సమయాన్ని పొందవచ్చు. ఇదిలావుంటే చాలామంది చేసిన ఖర్చులో కేవలం ఐదు శాతం చెల్లించి మిగతా మొత్తాన్ని వచ్చే నెలకు పొడిగిస్తున్నారు. కానీ దీనివల్ల ఏటా 45 శాతం వడ్డీతోపాటు, అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా పడుతుంది. ఇలా క్రెడిట్‌ను రోలింగ్ చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డ్ అప్పు ఎప్పటికీ తీరదు. కాబట్టి ఏ నెలకానెలే చెల్లించగల మొత్తానికే క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించండి.
గత నెలలో చేసిన కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించేవరకు కొత్త కొనుగోళ్లు జరపకపోవడం ఉత్తమం. మళ్లీ కొత్త కొనుగోళ్లపై వడ్డీలేని సమయం గురించి కాసేపు మరిచిపోండి. పాత అప్పు తీరేదాకా కొత్త అప్పు చేయరాదన్న సూత్రాన్ని ఇక్కడ పాటించండి. లేకపోతే రోలింగ్ క్రెడిట్ మీద కనీసం నెలకు మూడు నుంచి నాలుగు శాతం వడ్డీభారం తప్పదు. ఈ నెల వడ్డీ వచ్చేనెల అసలుకు కలుస్తుంది. మరో రకంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డ్ అప్పు చక్రవడ్డీ కన్నా ప్రమాదం.
క్రెడిట్ కార్డ్ మీద చేసిన అప్పు తీర్చలేకపోతే, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అంటే మరో కొత్త క్రెడిట్ కార్డ్‌కు ఇప్పుడున్న కార్డ్ నుంచి అప్పును బదిలీ చేయడం. ఇలా చేయడం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల 3.5 శాతం వడ్డీ కాస్తా 1.8 శాతం వరకు దిగివస్తుంది. రెండు కార్డ్‌లున్నాయి కదా అని విచక్షణారహితంగా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించరాదు.
ఒకవేళ అధిక మొత్తంలో కొనుగోళ్లు జరిపితే, వాటిని వాయిదాలతో చెల్లించండి. తద్వారా వడ్డీ తగ్గిపోతుంది. కొన్ని ఆఫర్లు నో-కాస్ట్ ఈఎంఐలతో ఉంటాయి. అలాంటి వాటిని కొనే ముందే ఆరా తీయండి. ఈఎంఐ ఆఫర్లను స్టోర్లు, క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఇస్తాయి. రెండింటిలో ఏది బెటరో కూడా పోల్చిచూసి నిర్ణయం తీసుకోండి. అలాగే ఇప్పటికే పేరుకుపోయిన అప్పును కూడా క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఈఎంఐలుగా మార్చుకోవడానికి అవకాశం ఇస్తాయి. దీనివల్ల క్రెడిట్ కార్డ్ మీదున్న వడ్డీ 45 శాతం నుంచి సగానికి తగ్గిపోతుంది.
బంగారం కొనుగోలు అలవాట్లపై ఇటీవలే ఐఐఎం అహ్మదాబాద్ చేసిన ఓ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలున్నవారు బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారట. దేశంలో గత ఐదేండ్లలో జరిగిన మొత్తం బంగారం అమ్మకాల్లో 56 శాతం ఈ ఆదాయ వర్గాలవారే కొనుగోలు చేశారట. అయితే సంపన్నుల్లో ప్రతి ఒక్కరి వినియోగం ఎక్కువగా ఉన్నా.. అధిక మొత్తం కొనుగోలు చేసింది మాత్రం మిడిల్ క్లాసేనని తేలింది. అయినప్పటికీ ఆదాయం పెరిగినంతగా బంగారం కొనుగోలు పెరగలేదు. పట్ణణ ప్రాంతాల్లోని అధికాదాయ వర్గాలు డిజిటల్ గోల్డ్ రూపంలో పుత్తడిని కొనుగోలు చేస్తున్నారు. రూ.10 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు గత ఏడాది 216 టన్నుల పసిడిని కొనుగోలు చేశారు. ఆపై వార్షికాదాయం ఉన్నవారు కేవలం 52 టన్నులే కొన్నారు. ఇక రూ.10 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు సగటున ఒక్కొక్కరు 9.42 గ్రాముల బంగారాన్ని కొంటే.. రూ.10 లక్షలకుపైగా ఆదాయం ఉన్నవారు సగటున ఒక్కొక్కరు 20.70 గ్రాముల బంగారాన్ని కొన్నారు.
సంపద సృష్టిలో పెట్టుబడులది కీలకపాత్ర. ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు, ఆర్థిక లక్ష్యాల సాధనకు, భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడులే ఉత్త మం. ఒకేచోట పొదుపు చేయడం కన్నా.. అనేక సాధనాల్లో మదుపు చేయడం మిన్న. కాబట్టి బ్యాంక్ ఖాతాల్లో వృథాగా పడి ఉన్న నగదును వివిధ వేదికలపైకి తరలించడం లాభదాయకం. పెట్టుబడుల
దశ-దిశలను ఒక్కసారి పరిశీలిస్తే..
1. స్టాక్ మార్కెట్లు
2. ఫిక్స్డ్ డిపాజిట్లు
3. మ్యూచువల్ ఫండ్స్
4. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం
5. పీపీఎఫ్
6. ఎన్పీఎస్
7. రియల్ ఎస్టేట్
8. గోల్డ్ బాండ్లు
9. రీట్స్
10. క్రిప్టో కరెన్సీలు
మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఎంచుకోవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం ఉంటుంది. ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. సురక్షిత సాధనాలను ఎంచుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు తదితరాల వైపు వెళ్లవచ్చు.
క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి నగదును విత్‌డ్రా చేస్తున్నారంటే ఆర్థికంగా మీరు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారని అర్థం. నగదు విత్‌డ్రా చేసిన రోజు నుంచే వడ్డీ భారం పడుతుంది. నగదు విత్‌డ్రా చేసినా దాన్ని నెలలోపే తీర్చేయండి. లేదంటే పెనాల్టీలు కూడా పడతాయి. అలాగే క్రెడిట్ కార్డ్ అప్పును వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద కూడా తీర్చేయవచ్చు. సాధారణంగా క్రెడిట్ కార్డ్ లిమిట్లో సగానికి మించి ఖర్చు చేయకండి. అప్పు ఎక్కువగా ఉండే కొద్దీ మీ సిబిల్ స్కోరు కూడా తగ్గుతుంది.
గత వారం వరుసగా మూడు రోజులూ దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం జరిగింది. నిఫ్టీలో క్రితం వారం ఏర్పడిన డోజీ క్యాండిల్ బేరిష్ ఫలితాలకు గత వారం ధృవీకరణ లభించింది. గత వారం కీలక మద్దతు స్థాయి 17,600లకు దిగువన సూచీ ముగియడంతోపాటు 20 రోజుల చలన సగటు వద్దే స్థిరపడింది. పైగా గత ఎగువముఖ స్వింగ్‌లో 23.6 శాతం రీట్రేస్మెంట్ స్థాయి 17,538కి దిగువనే ఉండటం ద్వారా నిఫ్టీ బేరిష్ సంకేతాలను ఇచ్చింది. మళ్లీ కనీసం 17,780 స్థాయికి ఎగువన ముగిస్తే తప్ప మార్కెట్ బుల్లిష్‌గా మారే అవకాశాల్లేవు. ఈ వారం విద్యుత్తు, రక్షణ, పర్యాటక, ఆతిథ్య రంగాల షేర్లు వెలుగులో ఉండవచ్చు. అదాని గ్రూపు షేర్లలో లాభాల స్వీకరణ జరగవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండియన్ హోటల్స్, మహీంద్రా హాలీడేస్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, యూఫ్లెక్స్ షేర్లు వెలుగులో ఉంటాయి. ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్న కంపెనీల షేర్లలో ఒడిదుడుకులు సహజంగానే అధికంగా ఉంటాయి.