రామన్నపేట, డిసెంబర్ 29: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలంలో గుప్త నిధులు లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కుంకుడుపాములలో వారం రోజుల క్రితం సర్వే నంబర్ 16, 17లో కన్నెబోయిన మల్లయ్య నాటు వేసేందుకు వరిపొలాన్ని చదును చేస్తుండగా మట్టిపాత్ర, దాంట్లో చిన్న ఇనుప పెట్టెలు కనిపించాయి. వాటిని తెరిచి చూడగా అందు లో 38 వెండి నాణేలు, 19 బంగారు పట్టీలు, 5 బం గారు గుండ్లు, 5 వెండి కడియాలు, 14 వెండి రింగు లు ఉన్నాయి.
నాటు వేసేందుకు వచ్చిన కూలీలు అతని తమ్ముడు కన్నెబోయిన లింగయ్య వాటిని పరిశీలిం చారు. ఈ నిధులు అన్నదమ్ముల మధ్య ఉన్న పొలం గట్టు లో లభించడంతో ఇద్దరూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. పొలం పనులు పూర్తయిన రెండు రోజుల తర్వాత సోదరులిద్దరూ గ్రామంలో పెద్దమనిషి వద్దకు వెళ్లారు. వాటాలు పంచుకునే విషయంలో వారి మధ్య తేడాలు వ చ్చాయి. విషయం బయటికి రావడం తో ఈ నెల 27న కన్నెబోయిన మల్లయ్య తనకు దొరికిన గుప్త నిధులను రామన్నపేట పోలీసులకు అందజేశాడు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి దర్యాప్తుచేస్తున్నారు.