Seasonal Allergies | ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సీజనల్ మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ వాతావరణం కొంత ఆనందంగా అనిపించినప్పటికీ, అదే సమయంలో పోలెన్ (పువ్వుల రేణువులు), బూజు, దుమ్ము వంటి అలెర్జీలు పెరుగుతాయి. ఇవి సీజనల్ అలెర్జీలను కలిగిస్తాయి. దీనిని అలర్జిక్ రైనిటిస్ (Hay Fever) అని కూడా అంటారు. గాల్లో ఉన్న అలెర్జీ కారకాలు కళ్లలో, ముక్కులో, గొంతులోకి వెళ్లినప్పుడు శరీరం అలెర్జిక్ ప్రతిచర్యను చూపిస్తుంది. ఈ సమయంలో పోలెన్ ఎక్కువగా ఉండటం వల్ల అలెర్జీలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సీజన్ మార్పుల సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. సీజనల్ మార్పుల సమయంలో అలెర్జీలను నివారించడానికి కొన్ని చిట్కాలను పాటించడం చాలా అవసరమని కూడా వారు చెబుతున్నారు. సీజనల్ మార్పుల సమయంలో అలర్జీల నుండి ఎవరిని వారు కాపాడుకోవడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సీజన్ మార్పుల సమయంలో పుప్పొడి స్థాయిలను ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు చెట్ల పుప్పొడి ఎక్కువగా పెరుగుతుంది. సాధారణంగా పోలెన్ స్థాయిలు ఉదయం ఎక్కువగా ఉంటాయి, మధ్యాహ్నం వరకు కొనసాగి సాయంత్రం తగ్గుతాయి. పోలెన్ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించి, అది తగ్గిన తర్వాతే బయటకు వెళ్లి పనులు చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే కిటికీలు తెరిచి ఉంచితే అలెర్జీ కారకాలు ఎక్కువగా ఇంట్లోకి వస్తాయి. కాబట్టి పోలెన్ ఎక్కువగా ఉన్న కాలంలో కిటికీలు మూసి ఉంచాలి. గది చల్లగా ఉండటానికి ఫ్యాన్లు లేదా ఎయిర్ కండిషనర్ ఉపయోగించండి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా కేబిన్ ఫిల్టర్ ఉపయోగించి, వెంటిలేషన్ మూసి ఉంచడం మంచిది.
అలాగే పోలెన్ చాలా సులభంగా జుట్టు, చర్మం, కనుబొమ్మలు, బట్టలపై అంటుకుంటుంది. కనుక బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ముఖం, తల బాగా శుభ్రం చేసుకోవాలి. ముక్కులో సలైన్ స్ప్రే వాడితే సైనస్‌లు శుభ్రపడతాయి. బయట వేసుకున్న దుస్తులను వెంటనే ఉతుక్కోవడం మంచిది. అదే విధంగా HEPA ఎయిర్ ప్యూరిఫైయర్లను ఉపయోగించాలి. ఇవి చాలా చిన్న పోలెన్ కణాలను కూడా (0.3 మైక్రాన్ వరకు) గ్రహించి గాలిని శుభ్రం చేస్తాయి. బెడ్రూమ్, లివింగ్ ఏరియాలో వీటిని ఉంచి రోజంతా ఉపయోగిస్తే మంచిది. డీహ్యూమిడిఫైయర్ ఉపయోగించి గదిలో తేమను 50% కంటే తక్కువగా ఉంచితే అలెర్జీలు తగ్గుతాయి. దుమ్ము, పోలెన్ ఇంటి ప్రతి ఉపరితలంపై పడతాయి. కాబట్టి కార్పెట్లు, రగ్గులు, సోఫాలను వారానికి ఒకసారి HEPA ఫిల్టర్ ఉన్న వాక్యూమ్‌తో శుభ్రం చేయడం మంచిది. నేలను తడి మాప్‌తో తుడవాలి. పుప్పొడి దుస్తులపై పడే అవకాశం ఉంది కనుక బెడ్ షీట్లు, దుప్పట్లు, దిండు కవర్లు వేడి నీటితో తరచుగా కడుగుతూ ఉండాలి. వాటిని బయట ఎండబెట్టడం కంటే ఇంట్లోనే ఆరబెట్టడం మంచిది.
అలాగే బయట పనులు చేసే వారు N95 మాస్క్ ధరించడం మంచిది. ఇది గాల్లో ఉన్న 95% వరకు కణాలను అడ్డుకుంటుంది. అలాగే కళ్లను రక్షించడానికి సన్‌గ్లాసెస్, ముఖాన్ని కాపాడేందుకు పెద్ద టోపీ ధరించండి. గాలి ఎక్కువగా ఉన్న రోజుల్లో ముక్కు మీద స్కార్ఫ్ వేసుకోవడం ద్వారా అలెర్జీ కారకాలు శరీరంలోకి ప్రవేశించకుండా ఉంటాయి. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలి. నీటిలో నిమ్మకాయ లేదా కీరదోస కలిపి తాగితే విటమిన్ సి లభిస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పసుపు పాలు, అల్లం టీ, వెల్లుల్లి కలిగిన వంటకాలు తినడం మంచిది. అవిసె గింజల వంటి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా వాపులు తగ్గి అలెర్జీలు తగ్గుతాయి.
ఈ విధంగా సులభమైన చిట్కాలను ఉపయోగించి అలెర్జీల బారిన పడకుండా ఎవరిని వారు కాపాడుకోవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా అలెర్జీ లక్షణాలు మొదలయ్యాక కాకుండా ముందు నుండే మందులు తీసుకోవడం మంచిదని, ఫిబ్రవరి చివర్లోనే యాంటీహిస్టమైన్ లేదా నాజల్ స్ప్రేలు వాడడం మొదలుపెట్టడం వల్ల అలెర్జీ తీవ్రత తగ్గుతుందని దీంతో అలెర్జీల వల్ల కలిగే అసౌకర్యం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.