Female Frogs |(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): అదో కప్ప జాతి. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి ఉత్తరంగా ఉండే కూరగాంగ్ ద్వీపంలోని అడవుల్లో నివసిస్తాయి. ఈ జాతిలోని ఆడ కప్పలు ఆకుపచ్చ రంగులో, మగ కప్పలు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటాయి. మగ కప్పలతో పోలిస్తే, ఆడ కప్పలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే, బయటకు అంత అందంగా కనిపించే ఆ ఆడ కప్పల దినచర్య మాత్రం భయానకంగా ఉంటుంది. అందుకే, ఆ కప్పలను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవిగా యూనివర్సిటీ ఆఫ్ న్యూక్యాజిల్ పరిశోధకులు అభివర్ణిస్తున్నారు.
ఎందుకు ప్రమాదకరమంటే?
తమ సంతానోత్పత్తిని వృద్ధి చేసుకోవడంలో భాగంగా ఆడ కప్పలు.. మగ కప్పల జత కోసం వెదుకులాట మొదలుపెడతాయి. తమకు తగ్గ జోడీని ఎంచుకోవడానికి మగ కప్పలకు సింగింగ్ కాంపిటీషన్ను నిర్వహిస్తాయి. తమకు నచ్చేవిధంగా మగ కప్పలు గీతాలాపన చేస్తే, మెచ్చి శృంగారంలో పాల్గొంటాయి. మగ కప్ప గొంతు నచ్చకపోతే, అప్పటికప్పుడే దాన్ని నోటితో నమిలి అమాంతం మింగేస్తాయి. ఈ మేరకు పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాన్ గౌడ్ ‘న్యూయార్క్ టైమ్స్’తో పేర్కొన్నారు.
ఎలా కనిపెట్టారంటే?
కూరగాంగ్ ద్వీపంలోని అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన కప్ప జాతిలో ఆడ కప్పల సంతతి ఎక్కువగా ఉన్నప్పటికీ, మగ కప్పల జనాభా క్రమంగా తగ్గిపోతుండటంతో శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు చేపట్టారు. కొద్దిరోజుల పాటు ఈ కప్పలజాతిపై నిఘా వేశారు. ఈ క్రమంలోనే ఈ విషయం బయటపడింది. కాగా మగ కప్పల కంటే ఆడకప్పల శరీరం, నోరు పెద్దగా ఉండటంతోనే అవి అమాంతం మగ కప్పలను నోటితో మింగేస్తున్నాయని జాన్ గౌడ్ వెల్లడించారు. మగ కప్పలు సాధారణంగా 2 అంగుళాల వరకు పెరిగితే, ఆడ కప్పలు 2.75 అంగుళాల నుంచి 3 అంగుళాల వరకూ పెరుగుతాయని వివరించారు.