హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్త్రీ, శిశుసంక్షేమ శాఖ, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖల ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను మార్చాలని ఎంప్లాయిస్ జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి సత్యవతి రాథోడ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో స్త్రీ, శిశు సంక్షేమశాఖను దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖతో అనుసంధానం చేశారని, తద్వారా ఉద్యోగుల పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతుందని, ఈ పరిస్థితిని మార్చాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ రెండు శాఖలను అన్నిస్థాయిల్లో డీ-మెర్జింగ్ చేసి స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. అలా సాధ్యం కాని పక్షంలో రెండు శాఖల ఉద్యోగులను కలిపి ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను మార్చాలని విజ్ఞప్తి చేశారు. మంత్రిని కలిసినవారిలో జేఏసీ చైర్మన్ జీ పున్నారెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్యోతి పద్మ, జాయింట్ డైరెక్టర్లు లక్ష్మిదేవీ, సునంద, కో-చైర్మన్ జయరాం నాయక్, రమణకుమార్, విజయ్‌కుమార్, ఉదయ్‌కుమార్, అంగన్వాడీ అసోసియేషన్ అధ్యక్షురాలు బిక్షపతమ్మ తదితరులు ఉన్నారు.