రక్షిత్ అట్లూరి, కోమలిప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శశివదనే’. గౌరినాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయిమోహన్ ఉబ్బన దర్శకుడు. మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్‌నిచ్చారు. రఘు కుంచె కెమెరా స్విఛాన్ చేశారు. రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ ‘విలక్షణ ప్రేమకథా చిత్రమిది. దర్శకుడు సాయి మోహన్ విజన్, కథ చెప్పిన విధానం నచ్చి అంగీకరించా’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ టైటిల్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. ప్రేమను కొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. శశివదనే ప్రేమ కోసం ఓ యువకుడు ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడన్నది హృదయాన్ని హత్తుకుంటుంది’ అని పేర్కొన్నారు. దర్శకుడు కథ చెప్పడం మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోనే సినిమాకు ఓకే చెప్పానని కోమలి ప్రసాద్ చెప్పింది. శ్రీమాన్, ప్రిన్స్, దీపక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, ఛాయాగ్రహణం: సాయికుమార్ దార.