“సర్కార్ బడి గింత మంచిగుంటదనుకోలేదు. మేం పిల్లలను సర్కారు బడికే పంపుతున్నం. మా బడి అందంగా, ముద్దుగా ఉన్నది. రోజూ మంచిగ అన్నం పెడుతున్నరు. పుస్తకాలు ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, ఇంగ్లీషు మీడియంలో చెప్పుతున్నరు. నెలకోసారి మమ్మల్ని పిల్చి మా సార్లు, టీచరమ్మలు మా పిల్లల చదువు గురించి చెప్తున్నరు! కాయకష్టం చేసేటోళ్ళం. అప్పోసప్పో చేసి మా పిల్లలనైనా మంచిగ చదివించుకోవాలని వేలకు వేలు అప్పులు చేసేటోళ్లం. ఇప్పుడు మాకు ఆ బాధ లేదు. మన కేసీఆర్ సారు బళ్లను మంచిగ చేస్తున్నరని విన్నం. మా ఊరు బడిని చూస్తే మాకు నిజమని అర్థమైంది. అందుకే ప్రైవేటుకు మాన్పించినం. మా ఊరు బళ్లోనే మా పిల్లలను చేర్చినం. మాకు ఇప్పుడు నాలుగు పైసలు మిగులుతున్నయి!”
ఈ మాటలు ఇవాళ ప్రభుత్వ బడికి పంపే పేద తల్లిదండ్రుల గుండె లోతుల్లోంచి వచ్చే మాటలు. ఇది కన్నులారా చూసే భాగ్యం ఈ విద్యాసంవత్సరం జూన్ 12వ తేదీన పాఠశాల ప్రారంభోత్సవం రోజున కలిగింది. భారత ప్రభుత్వం నుంచి కేంద్ర విద్యాశాఖలోని సంయుక్త కార్యదర్శి అమర్ప్రీత్ దుగ్గల్, ఉప కార్యదర్శి సుధా మీనన్ జూన్ 12వ తేదీన మన రాష్ట్రంలోని పాఠశాలల గురించి అధ్యయనం చేసేందుకు ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలుతీరును క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించేందుకు విచ్చేసిన సందర్భంలో మహబూబ్నగర్ జిల్లా ‘హన్వాడ’ ప్రాథమిక పాఠశాల సందర్శనలో తల్లిదండ్రులు వారితో మాట్లాడిన మాటలు. వారితోపాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ అధికార బృందం ‘హన్వాడ’ గ్రామంలో తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. ‘బడి’ ఎలా ఉంది? పిల్లలు ఎలా చదువుతున్నారని చర్చించినప్పుడు చోటుచేసుకున్న చర్చల సారాంశం ఇది.
వారందరూ తరగతి గది పరిశీలనలో భాగంగా ఉపాధ్యాయులతో ముచ్చటించిన మాటలు, ఉపాధ్యాయుల ప్రతిస్పందనలు కూడా ఆనందాన్ని కలిగించినయి. జూన్ 12వ తేదీ పాఠశాల ప్రారంభం రోజునే బోధనాభ్యసన సామగ్రితో బోధించడం, పిల్లలకు కార్యకలాపాలు, ఆటపాటలతో చదువు చెప్పడం, ఆ పిల్లలంతా ధారాళంగా చదువడం నిజంగా అద్భుత దృశ్యమే! ‘సుధ’ టీచర్ 3వ తరగతిలో బోధిస్తున్నప్పుడు కనిపించిన దృశ్యం ఇది.
సాధారణంగా ప్రభుత్వ బడి, ప్రభుత్వ ఉపాధ్యాయులు అనగానే చులకనగా భావించేవాళ్లు దీన్ని నమ్మకపోవచ్చు! కానీ, జరుగుతున్న వాస్తవం ఇదే. ‘సుధ’ టీచర్ మాట్లాడుతూ, ‘గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్న తొలిమెట్టు కార్యక్రమం వల్ల మేం ఫలితాలను చూడగలుగుతున్నాం! చాలా సంతృప్తిగా ఉంది, గర్వంగా కూడా ఉంది. మేం మా పిల్లల కోసం బోధనోపకరణాలను తయారుచేసుకొని బోధిస్తున్నాం. పుస్తకాలతో పాటు వీటిని ఉపయోగించడం వల్ల మా పిల్లలు అద్భుతంగా నేర్చుకుంటున్నారు. ప్రారంభంలో కొంచెం కష్టమనిపించింది. కానీ, ఇప్పుడు ఎంతో తృప్తిగా అనిపిస్తున్నది. ఆత్మవిశ్వాసంతో పనిచేయగలుగుతున్నాం’ అన్నారు. ‘సుధ’ లాంటి ఉపాధ్యాయుల మనోభావాలు నేడు ఏ పాఠశాలకు వెళ్లినా కనిపిస్తున్నాయి.
దీనికి కారణం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత తొమ్మిదేండ్ల కాలంలో పాఠశాల విద్యాశాఖలో చోటుచేసుకున్న సంస్కరణలు, పథకాలు, కార్యక్రమాల ప్రభావం అని చెప్పకతప్పదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని కనిష్ఠ స్థాయికి పడిపోయిన విద్యా ప్రమాణాలను మూలాలతో ప్రారంభించి అభ్యసన ఫలితాల సాధన దిశగా ఉపాధ్యాయులు బోధిస్తుండటానికి మన రాష్ట్రంలో నిర్వహిస్తున్న గుణాత్మక కార్యక్రమాలే కారణం. ‘ఆంగ్ల మాధ్యమం, ద్విభాషా వాచకాలు, డిజిటల్ వనరులు, పరీక్షల సంస్కరణలు, ఉపాధ్యాయులకు సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు, సాంకేతికత వినియోగం, ఆధునీకరించిన వాచకాలు ఇందుకు మూలస్తంభాలుగా నిలిచాయనడంలో అతిశయోక్తి లేదు. ప్రైవేటీకరణ వేగంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం పాఠశాలల ఉనికిని కాపాడటానికి, వాటికి పునరుజ్జీవనం కలిగించడానికి ఇవి తోడ్పతున్నాయి.
ఒకవైపు గుణాత్మక కార్యక్రమాలతో ముందంజలో వెళ్తుంటే, మరోవైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థను, ప్రధానంగా పాఠశాల విద్యావ్యవస్థను పటిష్ఠపరచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి అమలుపరుస్తున్న ‘మన ఊరు – మన బడి/ మన బస్తీ-మన బడి’ కార్యక్రమం ఉమ్మడి పాలనలో చితికిపోయి వెలవెలబోయిన ప్రభుత్వ బడిని సమూలంగా మార్చడానికి తోడ్పడుతున్నది. నేడు ఈ కార్యక్రమం వల్ల మౌలిక వసతులు మెరుగుపడటంతో పాటు, డిజిటల్ వనరులతో 21వ శతాబ్దపు నైపుణ్యాలను మన పిల్లలకు అందించేలా సర్కారు బడి సిద్ధమైంది. పేద బడుగు వర్గాల పిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో సర్కారు బడుల్లో నేర్చుకోవడానికి ఆంగ్ల మాధ్యమం తోడ్పడుతున్నది. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ తెలంగాణలోని పిల్లలందరు తెలుగు భాషను తప్పనిసరిగా నేర్చుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు వేదికగా పిలుపునిచ్చి చట్టాన్ని రూపొందింపజేయడం అభినందనీయం.
విద్యాశాఖలోని అన్ని వివరాలను సాంకేతికత ద్వారా సేకరించి సుపరిపాలనకు బాటలు వేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ కవులు, కళాకారులు, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం గురించి విద్యార్థులందరు తెలుసుకొని స్ఫూర్తి పొందేలా వాచకాలను ఆధునీకరించారు. వీటి రూపకల్పనా సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం వారికి విద్య పట్ల ఉన్న ప్రేమను తెలియజేస్తున్నది. బాలికల సాధికారత కోసం నిర్వహిస్తున్న కేజీబీవీ పాఠశాలలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలిచి ఆదర్శవంతంగా ముందుకువెళ్తున్నాయి. మిగతా రాష్ర్టాల్లో 10వ తరగతి వరకు విద్యనందిస్తుంటే మన రాష్ట్రంలో ఇంటర్ వరకు విస్తరించి వారి భవితకు బాటలు వేశారు. మన గురుకులాలు నాణ్యతకు మారుపేరుగా నిలిచి అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి.
ఇలా రాష్ట్ర ఆవిర్భావం నాటి పరిస్థితితో పోలిస్తే పిల్లల నమోదు, పాఠశాలలు అందుబాటులోకి రావడం, వసతి సౌకర్యాలు మెరుగుపడటం, పాలనా సంస్కరణలు, నాణ్యమైన విద్యను అందించటం వంటి విషయాలలో ఒక నిశ్శబ్ద విప్లవం చోటుచేసుకున్నది. నేడు విద్యాశాఖలో ఉన్న ప్రతి ఒక్కరు సగర్వంగా ఆనందించే స్థాయికి చేరుకున్నామని చెప్పుకోవచ్చు.
ఈ విద్యాసంవత్సరం నుంచి బడి పిల్లలకు ఇచ్చే రాగిజావా, వర్క్బుక్లు, నోట్బుక్లు, ఉపాధ్యాయులకు ఇచ్చే బోధనా ప్రణాళికలు, ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు వంటివి మరిన్ని మెరుగైన ఫలితాలకు దోహదపడుతాయని చెప్పవచ్చు. గత సంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయిలో నిర్వహిస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమంలాగానే ఈ విద్యా సంవత్సరం నుంచి 6 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించనున్న అభ్యసనాభివృద్ధి కార్యక్రమం, పదవ తరగతి పిల్లల కోసం అమలుచేస్తున్న సూక్ష్మస్థాయి కార్యాచరణ ప్రణాళిక ఉన్నత పాఠశాలల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి తోడ్పడుతున్నాయి. పిల్లల్లో పఠణ సంస్కృతిని పెంపొందింపజేయడానికి బలోపేతమవుతున్న పాఠశాల గ్రంథాలయాలు, రీడింగ్ కార్నర్లు, పఠణోత్సవం కార్యక్రమం, సైన్స్ హ్యాకథాన్ వంటివి తెలంగాణలోని పాఠశాల విద్యాశాఖను అగ్రపథంలో నిలుపుతుందని ఆశించవచ్చు. బడి నుంచి భవితకు బాటలు పడటం ద్వారా బంగారు తెలంగాణ అతిత్వరలో సాకారమవుతుందని నమ్ముదాం.
పేద బడుగు వర్గాల పిల్లలు కూడా ఆత్మవిశ్వాసంతో సర్కారు బడుల్లో నేర్చుకోవడానికి ఆంగ్ల మాధ్యమం తోడ్పడుతున్నది. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నప్పటికీ తెలంగాణలోని పిల్లలందరు తెలుగు భాషను తప్పనిసరిగా నేర్చుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు వేదికగా పిలుపునిచ్చి చట్టాన్ని రూపొందింపజేయడం అభినందనీయం.
సువర్ణ వినాయక్: 96186 76215
(వ్యాసకర్త: విద్యావేత్త, ఎన్సీఈఆర్టీ జనరల్ బాడీ మాజీ సభ్యులు)