హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఈనెల 28 నుంచి ప్రొ తైక్వాండో టోర్నీ తొలి సీజన్ హైదరాబాద్‌లో మొదలవుతున్నది. జేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా ఈ టోర్నీ జరుగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇందుకు సంబంధించిన బ్రోచర్, జెర్సీలను రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గురువారం ఆవిష్కరించారు. టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించింది. అత్యుత్తమ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల్లో రెండు శాతం, ఉన్నత విద్యలో 0.5 శాతం కల్పిస్తున్నాం. ప్రొ తైక్వాండో తొలి సీజన్ విజయవంతం కావాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్‌రావు, జయంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.