పెద్దఅంబర్‌పేట, జనవరి 14 : ‘ఆ ఎర్ర గుడ్ల పతంగికి పేంచీ పడ్డదిరా.. డీల్ ఇడువు.. కాటే’ అంటూ యువత కేరింతలు.. ‘అరే ఇది ఊరికనే కట్ అయిపోతుంది. మంచి మాంజా తీసుకుని రారా’ తమ్ముడికి అన్న సూచన.. ‘చరఖా మంచిగ పట్టుకో.. డీల్ ఇడవకపోతే మనదే కట్ అయితది’ ఓ చెల్లితో సోదరుడు.. ఇలా యాడజూసినా పతంగుల సందడే.
అంతా కలిసి..
కొంతమంది బంధువులతో కలిసి భోగి పండుగను జరుపుకోగా.. చాలామంది స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. ఇంటిల్లిపాది పొద్దున్నే వంటలు పూర్తి చేసుకుని దాబాలపైకి చేరారు. చేతుల్లో పతంగులు, చరాక్లు పట్టుకుని కొందరు మైదానాల బాట పట్టారు. ఇండ్లపై డీజే సౌండ్లు ఏర్పాటుచేసి ఉత్సాహంగా గడిపారు. ప్రత్యేకంగా కొందరు పతంగులను ఆర్డర్లు చేసి తెప్పించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పతంగులతోనే గడిపారు. పిండి వంటలు, ఇతర తినుబండారాలను ఇండ్లపైనే పెట్టుకుని తింటూ సరదాగా సంతోషాలు పంచుకున్నారు. ఓ వైపు పతంగులు ఎగురుతుండగానే.. పాటలకు చిన్నారులు డ్యాన్సులు చేస్తుండగా చూసి పెద్దలు మురిసిపోయారు.
చిన్నారుల ముచ్చట తీర్చి..
పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రత్యేకంగా పతంగులు తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపారు. ఏడాది నుంచి ఐదేండ్లలోపు పిల్లలు మురిసిపోయేలా కేవలం అరచేతి సైజులో ఉన్న విభిన్న పతంగులు, చిన్న చర్ఖాలతో వారిలో సంతోషం నింపారు. భోగి పండుగ రోజు చిన్నారులకు హారతులు ఇచ్చారు. రేగిపండ్లు చల్లి దీవెనలు అందించారు.