కమాన్చౌరస్తా, జనవరి 6: పల్లె సంస్కృతిని భావితరాలకు తెలిపే ప్రతిభింబాలే పండుగలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో గురువారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబురాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
సంక్రాతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కాగా, పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, రైతే రాజు, శబరిమల దర్శనం, భోగిపండ్ల వైభవం, వాయినాలు తదితర కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సిద్ధార్థ పాఠశాలలో..
మంకమ్మతోటలోని సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ దాసరి జగత్పాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. భోగి మంటలు ఏర్పాటు చేసి విద్యార్థులంతా చుట్టూ తిరుగుతూ ఆటాపాటలతో సందడి చేశారు. అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు.
పలువురు విద్యార్థులు గోదాదేవి, హరిదాసు, గంగిరెద్దుల, జంగమదేవరుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో పాఠశాల డైరెక్టర్ దాసరి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.