
ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 17: తార్నాక డివిజన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి శానిటేషన్ సామగ్రిని పంపిణీ చేశారు. డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ పంపిణీ చేపట్టారు. కార్మికులకు ఎన్-95 మాస్కులు, శానిటైజర్, షూస్, ఇతర అత్యవసర వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అన్ని సమయాల్లోనూ ప్రజలకు సేవ చేస్తారని గుర్తు చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ వారు ముందుండి సేవలందించారని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులు లేని సమాజాన్ని కనీసం ఊహించుకోలేమన్నారు. అటువంటి పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పల్లె మోహన్‌రెడ్డి, ఏఎంఓహెచ్ డాక్టర్ రవీందర్‌గౌడ్, డీఈ గీత తదితరులు పాల్గొన్నారు.