న్యూఢిల్లీ, డిసెంబర్ 17: అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్స్‌లో సంఘీ ఇండస్ట్రీస్, పెన్నా సిమెంట్ విలీనం కానున్నాయి. గత ఏడాది డిసెంబర్లో సంఘీ, ఈ ఏడాది ఆగస్టులో పెన్నాలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సిమెంట్ తయారీ కార్యకలాపాలను ఒక్కచోటికి చేర్చాలని గ్రూప్ భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ మూడు సిమెంట్ తయారీ సంస్థలను కలిపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. షేర్హోల్డర్లు, రెగ్యులేటర్ల అనుమతుల దృష్ట్యా 9 నుంచి 12 నెలల్లో ఈ విలీన ప్రక్రియ పూర్తికాగలదన్న ఆశాభావాన్ని అదానీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
విలీనం ఇలా..
ప్రస్తుతం అంబుజా సిమెంట్స్‌కు సౌరాష్ట్ర కేంద్రంగా నడుస్తున్న సంఘీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఎస్ఐఎల్), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (పీసీఐఎల్)లు అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. దీంతో వీటిని తమలో విలీనం చేసుకునేందుకు వేర్వేరు పథకాలను ప్రకటించనున్నామని అంబుజా వర్గాలు చెప్తున్నాయి. తాజాగా జరిగిన సమావేశంలో అంబుజా సిమెంట్ బోర్డు కూడా ఈ స్కీములకు ఆమోదం తెలిపింది. కాగా, సంఘీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో అంబుజాకు 58.08 శాతం వాటా ఉన్నది. దీని ప్రకారం అర్హులైన సంఘీ షేర్హోల్డర్లకు రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతీ 100 ఎస్ఐఎల్ ఈక్విటీ షేర్లకుగాను.. రూ.2 ముఖ విలువ కలిగిన 12 ఈక్విటీ షేర్లను అంబుజా జారీ చేయనున్నది. అలాగే పెన్నా ఈక్విటీ షేర్హోల్డర్లకు రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతీ ఫుల్లీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్‌కు రూ.321.50 చొప్పున అంబుజా చెల్లించనున్నది.
గట్టి పోటీ
సంఘీ, పెన్నాల విలీనంతో ఆదిత్యా బిర్లా గ్రూప్‌నకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్‌కు మార్కెట్లో ఉత్పత్తి, అమ్మకాలు, కార్యకలాపాల దృష్ట్యా గట్టి పోటీని ఇవ్వడానికి వీలవుతుందని కూడా అదానీ గ్రూప్ యోచిస్తున్నది. కాగా, 2022 సెప్టెంబర్‌లో అదానీ గ్రూప్ దాదాపు రూ.51,000 కోట్లతో అంబుజా సిమెంట్స్‌ను కొన్న సంగతి విదితమే. ఇక ఏసీసీ లిమిటెడ్‌లో అంబుజా సిమెంట్స్‌కు 51 శాతం వాటా ఉన్నది. రూ.31,000 కోట్లతో మరో 26 శాతం అదనపు వాటానూ కొనేందుకు సిద్ధమయ్యారు.