నారాయణఖేడ్, అక్టోబర్ 31 : గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ లక్ష్య సాధనలో నారాయణఖేడ్ మండలం ర్యాకల్ క్లస్టర్ ముందంజలో నిలిచి దేశం దృష్టిని ఆకర్షించింది. తొలి విడుతలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 94 క్లస్టర్లలో ర్యాకల్ నెంబర్‌వన్‌గా నిలిచింది. వేగవంతంగా పనుల పూర్తి, లక్ష్యం మేరకు నిధుల వినియోగం వంటి అంశాలు ర్యాకల్ క్లస్టర్‌కు అరుదైన ఘనతను తెచ్చిపెట్టాయి. ర్యాకల్ కేంద్రంగా మండలంలోని ఆయా గ్రామాల్లో ఐదేండ్లుగా నిరంతరాయంగా అభివృద్ధి పనులు కొనసాగేందుకు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి చూపుతున్న ప్రత్యేక చొరువ, అధికారుల సహకారమే కారణంగా చెప్పాలి. రూ.30 కోట్ల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రూ.25 కోట్ల పనులు మంజూరు కాగా, రూ.22.40 కోట్ల పనులు పూర్తి చేసిన ఫలితంగా ర్యాకల్ రూర్బన్ ఈ కీర్తి కిరీటాన్ని దక్కించుకున్నది. దేశంలోని మరే క్లస్టర్ సాధించని ఖ్యాతిని ర్యాకల్ క్లస్టర్ సాధించడంపై ప్రత్యేక కథనం.
స్వయం ఉపాధి, వ్యవసాయంపై దృష్టి..
ప్రజావసరాలు, మౌలిక వసతుల కల్పనకు రూర్బన్ మిషన్ ప్రాధాన్యం ఇచ్చింది. మరో వైపు వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి అందుకనుగుణంగా అవరమైన చర్యలు చేపడుతున్నది. నారాయణఖేడ్ నుంచి ఇతర ప్రాంతాలకు నిరుపేదలు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లకుండా ఆ దిశగా కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించింది. మహిళా సమాఖ్యల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కొనసాగించేందుకు రూ.10లక్షలను మంజూరు చేసింది. మండలంలోని నిజాంపేటలో దాల్మిల్ పరిశ్రమ నిర్వహణకు స్థానిక మహిళా సంఘం ముందుకు వచ్చిన నేపథ్యంలో త్వరలో దాల్మిల్ ప్లాంట్ ఏర్పాటు కానున్నది. ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని బలోపేతం చేసే దిశగా వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తున్నది. నారాయణఖేడ్ మండలంలో పాల ఉత్పత్తిపై ఆధారపడిన రైతులను ప్రోత్సహించేందుకు జూకల్ శివారులో రూ.4.45 కోట్ల భారీ వ్యయంతో ఆధునిక పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు దీనికి అనుసంధానంగా నిజాంపేటలో రూ.24 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. నారాయణఖేడ్‌లో రూ.75 లక్షలతో సమీకృత పశువైద్యశాల నిర్మాణం చేపడుతుండగా, సంజీవన్‌రావుపేట, నిజాంపేట, హన్మంత్‌రావుపేట, రుద్రారం గ్రామాల్లో పశువైద్యశాల భవనాల ఏర్పాటుకు రూ.66 లక్షలతో పనులు చేపడుతున్నారు. రూ.9లక్షలు వెచ్చించి దాదాపు అన్ని గ్రామాల్లో ట్రావీస్ ఏర్పాటు చేశారు. నిజాంపేట్, ర్యాకల్, లింగాపూర్ గ్రామాల్లో గోడౌన్లు, ధాన్యం ఆరబెట్టేందుకు డ్రై ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణానికి రూ.1.05 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. పందిరిసాగును ప్రోత్సహించేందుకు రూ.48 లక్షల వ్యయంతో 40 యూనిట్లను మంజూరు చేశారు.
పనులు 480, పూర్తయినవి 434..
శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 94 క్లస్టర్లను ఎంపిక చేసి 2017లో క్షేత్రస్థాయిలో కార్యాచరణను ప్రారంభించింది. కార్యక్రమంలో భాగంగా రూ.30 కోట్ల నిధులతో క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నదే రూర్బన్ లక్ష్యం. రూర్బన్ మిషన్‌కు మంజూరయ్యే నిధులను 60 శాతం కేంద్ర ప్రభుత్వం, 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్నది. రూ.25 కోట్ల నిధులు విడుదల కాగా, ఇప్పటి వరకు రూ.22.40 కోట్ల నిధుల వినియోగం జరిగింది. మొత్తం 480 పను లు మంజూరు కాగా, 434 పనులను పూర్తి చేయ గా, ప్రస్తుతం 34 పనులు నిర్మాణ దశలో ఉన్నా యి. మరో 12 పనులను ప్రారంభించాల్సి ఉంది.
సమష్టి కృషితోనే సాధ్యమైంది…
అందరి సమష్టి కృషితో ర్యాకల్ రూర్బన్ ఈ ఘనత సాధించింది. ఉన్నతాధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టడంతో పనులు సకాలంలో పూర్తయ్యాయి. రూ.30 కోట్ల నిధులు ఒక్క నారాయణఖేడ్ మండలంలో వెచ్చించడం ఆషామాషీ కాదు. నిరంతరం కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించడంతో పనులు వేగవంతంగా పూర్తయ్యాయి. దేశంలోని మొత్తం 94 క్లస్టర్లలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ర్యాకల్ క్లస్టర్ నెంబర్‌వన్‌గా నిలువడం ఆనందంగా ఉంది.