జహీరాబాద్, ఏప్రిల్ 23 : ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహరక మందులను అధిక ధరలకు అమ్మితే కఠినే చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా వ్యవసాయశాఖాధికారి శివప్రసాద్ హెచ్చరించారు. బుధవారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన జహీరాబాద్ వ్యవసాయ శాఖ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లోని అధీకృత డీలర్ల సమావేశంలో ఎరువులు, విత్తనాలు, క్రిమి సంహరక మందుల చట్టాలపై వ్యవసాయశాఖాధికారి శివప్రసాద్ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు, విత్తనాలు, మందులను రైతులకు విక్రయించాలని సూచించారు. వాటికి సంబంధించిన ఇన్వాయిజ్, సోర్స్ ఆఫ్ సర్టిఫికెట్లు త్పప్పని సరిగా ఉండాలన్నారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, మందులకు తప్పని సరిగ్గా రశీదులను ఇవ్వాలని సూచించారు. వానాకాలం సీజన్లో రైతులు సాగు చేసుకునేందుకు అవసరమైన ఎరువులు, విత్తనాల ఎలాంటి కొరత లేదని తెలిపారు. విత్తనాలు, ఎరువుల కొరత సృష్టించే అధీకృత డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల్లోని ఎరువులు, విత్తనాలను విక్రయించే దుకాణాలను ఎప్పటికప్పుడు సంబంధిత వ్యవసాయాధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి, వ్యవసాయాధికారులు లావణ్య, అవినాశ్ వర్మ, హసుద్దీన్, వినోద్ కుమార్, వెంకటేశ్వర్లు, ఏఈవో ప్రదీప్‌కుమార్, ఆయా మండలాల్లోని అధీకృత డీలర్లు తదితరులు పాల్గొన్నారు