పటాన్చెరు రూరల్, మార్చి 3 : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల మాధవి కాంగ్రెస్ పార్టీ విప్ ధిక్కరించడంతో ఎన్నికల అధికారి ఆమెను కౌన్సిల్‌కు అనర్హురాలిగా ప్రకటించారని మున్సిపల్ కమిషనర్ వెంకటకిషన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇస్నాపూర్ పురపాలక సంఘం రెండో సాధారణ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన పట్లోళ్ల మాధవి బీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి మోటే సుమలత చైర్పర్సన్, మాధవి వైస్ చైర్పర్సన్ పదవి ని కైవసం చేసుకున్నారు.
పార్టీ విప్‌ను ధిక్కరించిన మాధవిపై చర్యలు తీసుకోవాలని ఇస్నాపూర్ అథరైజ్డ్ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్‌కు డీసీసీ అధ్యక్షురాలు ఫిర్యాదుచేశారు. దీంతో ఎన్నికల నిర్వహణ అధికారి మాధవికి విప్ ధిక్కరణపై షోకాజ్ నోటీస్ జారీచేశారు. ఆమె సమాధానం ఆధారంగా విచారణ జరిపి, మార్చి 2న మున్సిపల్ కౌన్సిల్ సభ్యత్వం నుంచి అనర్హురాలిగా ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారం అనర్హత వేసినట్టు కమిషనర్ తెలిపారు.