సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల స్మగ్లింగ్‌పై పోలీసులు, ఆబ్కారీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. సరిహద్దుల్లో నిఘాను ముమ్మరం చేశారు. దుకాణాలు, పాన్‌షాప్‌ల్లో తనిఖీలు చేస్తున్నారు. వరుసగా చేస్తున్న దాడులతో స్మగ్లర్లు జాగ్రత్త పడుతున్నారు. గంజాయిను తరలించేందుకు తరుచూ వాహనాలు, డ్రైవర్లను మార్చుతున్నారు. సరుకు చేరాల్సిన ప్రాంతానికి వెళ్లే సరికి అనేక మంది డ్రైవర్లు, వాహనాలను మార్చుతున్నట్లు తెలిసింది. దాబాలు, హోటళ్లు, నిర్మానుష్య ప్రాం తాల్లో ఈ తతంగం కానిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, మహారాష్ట్ర, కర్ణాటక, జిల్లాల సరిహదుల్లో ఇంటలిజెన్స్, ప్రత్యేక పోలీసు అధికారులు మఫ్టీలో నిఘా వేసి గంజాయి స్మగ్లింగ్ అడ్డుకట్టకు చర్యలు చేపడుతున్నారు. గంజాయితో పట్టుబడిన వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి వాడకం విషయంలో యువత, విద్యార్థ్ధులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు.
జహీరాబాద్/మెదక్/సిద్దిపేట, అక్టోబర్ 26 : సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో మత్తు పదార్థాలపై పోలీసులు, ఆబ్కారీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు నిఘాను కట్టుదిట్టం చేశారు. గంజాయి సాగుచేసే వారు, రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. గంజాయి పండిస్తే రైతుబంధు, రైతుబీమా, ఆర్వోఎఫ్ భూముల్లో సాగుచేస్తే పట్టాలు రద్దు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు ఆనుకుని కర్ణాటక, మహారాష్ట్ర సరిహదుల్లో ఇంటలిజెన్స్, ప్రత్యేక పోలీసు అధికారులు మఫ్టీలో నిఘా వేసి పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర సరిహద్దు, జాతీయ రహదారిపై నిఘా..
రాష్ట్ర సరిహద్దు, సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారిపై పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఇంటలిజెన్స్,ఎస్బీ పోలీసులు సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, భద్రాచలం నుంచి మహారాష్ర్ట ముఠాలు గంజాయి సేకరించి తరలిస్తున్నాయి. మహారాష్ర్ట, గోవా నుంచి మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు ప్రైవేటు వాహనాల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్మగ్లర్లు గంజాయి, మత్తు పదార్థాలు ప్రైవేటు వాహనాలు, సైకిల్ మోటార్లపై స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.
డ్రైవర్లను మార్చుతూ సరుకు రవాణా..
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వాహనం 50కిలోమీటర్ల దూరం వెళ్లగానే స్మగ్లర్లు డ్రైవర్లను మార్చుతున్నారని తెలిసింది. ప్రైవేటు వాహనాల్లో మత్తు పదార్థాలు సరఫరా చేసే ముఠాలు ముందుగానే డ్రైవర్లను నియమించుకుంటున్నాయి. కార్లు, ఇతర వాహనాల్లో స్మగ్లింగ్ చేస్తున్న గం జాయి ఎక్కడికి వెళ్తున్నదనే సమాచారం డ్రైవర్లకు తెలియకుండా స్మగ్లర్లు జాగ్రత్త పడుతున్నారు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వరకు ఒక డ్రైవర్, మళ్లీ అక్కడి నుంచి ఇంకో డ్రైవర్‌తో సరుకు తరలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి సమీపం వరకు ఒక డ్రైవరు వాహనంలో సరుకు తెస్తాడు. పలానా దాబా, పలానా హోటల్ వద్ద వాహనం నిలిపి వెళ్లిపోవాలని సమాచారం స్మగ్లరు ముందే సమాచారం అందిస్తాడు. అక్కడి నుంచి మరో డ్రైవరు ఆ వాహనాన్ని తీసుకొని వెళ్తాడు. అలా స్మగ్లర్లు జాగ్రత్తలు తీసుకుంటూ సరుకు అనుకున్న చోటకి చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులపై హోటళ్లు, దాబాల వద్ద పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
కిరాణా దుకాణాలు.. పాన్ డబ్బాలపై నజర్…
గంజాయి విక్రయాలను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రెండు రోజుల క్రితం మెదక్ జిల్లావ్యాప్తంగా గుట్కా పాన్‌మసాలా, సిగరెట్లు విక్రయించే చోట తనిఖీలు నిర్వహించాయి. సంగారెడ్డి జిల్లా సరిహద్దులోని రేగోడ్, అల్లాదుర్గం మండలాల్లో నిఘా పెంచారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాల్లో, శివారులో రహస్య ప్రదేశాలపై పోలీసులు దృష్టి సారించారు. సిద్దిపేట జిల్లాలోనూ అన్నిచోట్ల దాడులు, తనిఖీలు ముమ్మరం చేశారు.
వరుసగా పట్టుబడితే పీడీ యాక్టు నమోదు..
గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, తాగినా ఉక్కుపాదం మోపనున్నారు. గంజాయి విక్రయిస్తూ వరుసగా పట్టుబడితే పీడీ యాక్ట్టు నమోదు చేయనున్నారు. యువత, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఆ తర్వాత కేసులు నమోదు చేయనున్నారు. గంజాయి దందాను అడ్డుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తున్నారు.
ముమ్మరంగా తనిఖీలు…
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణాపై నిఘా పెంచిన పోలీసులు.. కిరాణా దుకాణాలు, పాన్ డబ్బాలపై దాడులు చేస్తున్నారు. ఎక్కడైనా గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారు. వెనుక ఉండి నడిపించేదెవరు అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల పరిధిలోని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు.
ఎవ్వరినీ ఉపేక్షించం..
గంజాయి తీసుకున్నా, విక్రయించినా, రవాణా చేస్తున్న వారిపై నిఘా పెట్టాం. గంజా యి అమ్ముతున్నట్టు తెలిస్తే ఎం తటివారైనా ఉపేక్షించం. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాం. యువత, విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించాం.