దౌల్తాబాద్, అక్టోబర్ 28 : తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో మంగ విజయ్‌కుమార్, కొల్గూరికి చెందిన సంతోషతో 1996లో వివాహం జరిగింది. వివాహం అనంతరం హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్న సమయంలో విజయ్‌కుమార్‌కు కారు యాక్సిడెంట్‌తో నడుము విరిగింది. విజయ్‌కుమార్ తన వైద్య ఖర్చుల కోసం 4 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. కొన్ని నెలల తర్వాత విజయ్‌కుమార్ అనారోగ్యం నుంచి కోలుకొని సొం తంగా కారు కొని హైదరాబాద్‌లో కారు నడుపుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. 2009లో ఆర్థిక పరిస్థితులతో హైదరబాద్‌లో విజయ్‌కుమార్ భార్య ఆత్మహత్య చేసుకుంది. విజయ్‌కుమార్ భార్య చనిపోయిన తర్వాత నలుగురు చిన్నారులను అమ్మమ్మ, చిన్నమ్మ తీసుకెళ్లారు. విజయకుమార్ తన కారును అమ్మి చిన్న ఆటో కొన్నాడు. ఈ క్రమంలో ఆటో బొల్తా కొట్టడంతో విజయ్‌కుమార్ కాలు విరిగింది. డబ్బులు లేక విరిగిన కాలుతో విజయ్‌కుమార్ గాజులపల్లిలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ తన తల్లి లచ్చవ్వతో జీవనం గడుపుతున్నాడు. ఈనెల 17న విజయ్‌కుమార్ పారిశుధ్య పనులు ముగించుకొని వచ్చి రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున విజయ్‌కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే ఉస్మానియా దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ విజయ్‌కుమార్ మృతి చెందాడు. తల్లిదండ్రుల మృతి చెందడంతో ఆ నలుగురు అనాథలయ్యారు.