సంగారెడ్డి, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్ 10న పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల అధికారిగా మెదక్ కలెక్టర్ వ్యవహరించనున్నారు. మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల కోసం ఈనెల 16న నోటిఫికేషన్ రానున్నది. ఈ నేపథ్యంలో అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లకు ఓటు హక్కు ఉంటుంది. జిల్లా పునర్విభజనలో భాగంగా సిద్దిపేట జిల్లాలో చేర్చిన మండలాలు, మున్సిపాలిటీలను మినహాయించి ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నారు. అధికారుల సమాచారం మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా (పాత జిల్లా)లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు మొత్తం 1,062 స్థానాలున్నాయి. ఇందులో 47 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగలేదు. దీంతో అక్కడ 37 కౌన్సిలర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, బొల్లారం మున్సిపాలిటీలో ఇద్దరు కౌన్సిలర్లు మృతి చెందారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో 39 కౌన్సిలర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 8 మంది ఎంపీటీసీలు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, మెదక్ జిల్లాలో ఇదుగురు, సిద్దిపేట జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 47 ఖాళీ స్థానాలు మినహాయించగా, ప్రస్తుతం 1,015 మంది ఓటర్లు ఉన్నారు. వీరు రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్లు మొత్తం 478 మంది ఓటర్లు ఉండగా, మెదక్ జిల్లాలో 279 మంది, సిద్దిపేట జిల్లాలో 258 మంది ఓటర్లు ఉన్నారు.
సంగారెడ్డిలో అత్యధిక ఓటర్లు…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలో 478 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 25 మంది జడ్పీటీసీలు, 293 మంది ఎంపీటీసీలు, 160 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మెదక్ జిల్లాలో 20 మంది జడ్పీటీసీలు, 184 మంది ఎంపీటీసీలు, 75 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 16 మంది జడ్పీటీసీ, 159 మంది ఎంపీటీసీలు, 83 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు. వీరంతా త్వరలో నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు.