మోర్తాడ్, మే 21: పల్లెల్లో గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం కొనసాగుతున్నది. చివరకు ఇసుక తవ్వకాల్లోనూ వీడీసీల హవా నడుస్తున్నది. ఎక్కడా ఇసుక తవ్వకాలు చేపట్టాలన్నా సంబంధిత గ్రామాభివృద్ధి కమిటీల అనుమతి ఉండాల్సిందే. ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. అది లీగల్క్వారీ అయినా, ఇల్లీగల్ క్వారీ అయినా సరే ట్రిప్పుకు ఇంత అని కప్పం చెల్లించాల్సిందే. లేకుంటే ఇసుమంతైన కూడా ఇసుక బయటకు తరలదు. అయితే, ఒక్కో గ్రామంలో ఒక్కోతీరుగా వ్యవహారం కొనసాగుతున్నది. ఇసుక క్వారీలన్నీ కూడా అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు జరుగుతున్నా, అధికారపార్టీ నాయకులే ఇసుక తరలిస్తుండడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి.
తొర్తి గ్రామంలో మొదట ఇసక ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.2500 చొప్పున అధికారపార్టీ నాయకులే వసూలు చేసినట్లు తెలిసింది. ఇందులోంచి గ్రామ కమిటీకి రూ.వేయి, లేబర్‌కు రూ.400 పోను మిగతావన్నీ అధికారపార్టీ నాయకులే జేబులో వేసుకున్నట్లు సమాచారం. ఇలా రూ.లక్షలు వెనుకేసుకోవడంతో విషయం గ్రామకమిటీకి తెలిసింది. దీంతో అధికార పార్టీ నాయకులు వసూళ్లు చేయరాదని చెప్పడంతో గ్రామంలో కొన్ని రోజుల పాటు ఇసుక తరలింపునకు బ్రేక్ పడింది. అయితే, అధికారపార్టీ నాయకుడు ఒకరు రంగంలోకి దిగడంతో మళ్లీ ఇసుక రవాణా ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు గ్రామ కమిటీయే ట్రిప్పుకు రూ.1500 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిసింది. అందులోంచి అధికార పార్టీ నాయకులకు రూ.500 ఇవ్వాలన్న నిర్ణయం మేరకు ఇసుక తరలింపు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇసుక నడిచిన ప్రతిసారి ట్రిప్పులను లెక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకుడు ఒకరిని ఉంచుతున్నట్లు సమాచారం. వసూలు చేసే డబ్బులు అధికారుల కోసమని బాహటంగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. మంగళవారం నుంచే మోర్తాడ్ మండలం పాలెం, మెండోరా మండలం వెల్కటూర్ పెద్దవాగుల నుంచి ఇసుక తరలింపుకు అధికారులు అనుమతిని ఇచ్చారు. అయితే, ఇక్కడ కూడా ట్రిప్పుకు రూ.వేయి చొప్పున గ్రామకమిటీకి చెల్లించాల్సిందే. పాలెం పెద్దవాగులో మంగళవారం జేసీబీ పెట్టి ఇసుక తవ్వకాలు చేపట్టగా, విషయం తెలుసుకున్న అధికారులు జేసీబీని తిరిగి పంపించినట్లు తెలిసింది. అయితే, ప్రతిచోటా వేబిల్లులు లేకుండా ఇసుక రవాణా కొనసాగుతుండడం, ఉదయం 5 గంటలకే ట్రాక్టర్లు వాగులోకి వెళ్తుండడం, వాటికి నంబర్లు లేకపోవడం, డ్రైవర్లకు లైసెన్సులు లేకపోవడం ఇలా చాలా రకాలుగా నిబంధనలను అతిక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న స్థానికులు చెబుతున్నారు.
మోర్తాడ్ మండలం శెట్పల్లి పెద్దవాగు నుంచి నెల రోజులుగా అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇందులో అధికారపార్టీ నాయకులదే ప్రధాన పాత్ర ఉన్నట్లు తెలిసింది. అధికారికంగా ఎటువంటి అనుమతులు లేకున్నా గ్రామ కమిటీకి ట్రిప్పుకు రూ.వేయి చొప్పున చెల్లించి అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు లేని సమయంలో ఇసుకను తరలిస్తే పట్టుకునే వారు ఉండరన్న ధీమాతో అక్రమ ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. మోర్తాడ్ మండలంలో ఇసుక అక్రమ రవాణా గురించి, వసూళ్ల గురించి వివరణ కోసం తహసీల్దార్, ఆర్ఐలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.
ఏర్గట్ల మండలం తడ్పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ శివారులోని గోదావరి నుంచి అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలు ఆగడం లేదు. ఈ వ్యవహారం కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇటీవల దోంచంద గ్రామంలో రెవెన్యూ అధికారులు దాదాపు 200 ట్రాక్టర్ల ఇసుక డంప్‌లను సీజ్ చేశారు. ఏండ్ల తరబడి గోదావరి నీళ్లలోంచి ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి ఉనికికే ప్రమాదమని తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అధికారులకే తెలియాలి.
తొర్తి పెద్దవాగు నుంచి ఇసుక తరలింపునకు అనుమతి ఇస్తున్నాం. అనుమతి తీసుకున్న వారికి వేబిల్లులు ఇస్తున్నాం. వేబిల్లుల ప్రకారం ఇసుక తరలింపు జరుగుతన్నది. అక్కడ అదనంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. దానిపై విచారణ జరిపిస్తాం.
– మల్లయ్య, ఏర్గట్ల తహసీల్దార్