నర్సింహులపేట ఫిబ్రవరి 10 : నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం, కౌసల్య దేవి పల్లి, ఫకీర్ తండా, జయపురం, కొమ్ములవంచ ,బొజ్జన్నపేట గ్రామాల పరిధిలోని ఆకేరు వాగు నుంచి యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా(Sand Illegally transported) జోరుగా సాగుతోంది. దీనికి తోడు అక్రమ ఇసుక రవాణా చేస్తుండడంతో భూగర్భ జలాలు తగ్గి సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. యాసంగి సాగు చేసిన వరి పంటకు ఫిబ్రవరి నెలలోనే వాగులో నీరు సరిగా లేదని ఇసుక తోడేస్తే ఉన్న నీరు ఎండిపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన చేస్తున్నారు.
దీనికి తోడు వాగు వెంట ఉన్న మోటర్లు, స్టార్టర్లు అపహణకు గురవుతున్నాయని వాపోతున్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు రామన్నగూడెం, కౌసల్యదేవిపల్లి, నర్సింహులపేట గ్రామాల పరిధిలో మూడు చెక్ పోస్ట్(check post) ఏర్పాటు చేశారు. దీంతో ఆ మూడు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాకు ఆడ్డుకట్ట వేసినప్పటికీ జయపురం, కొమ్ములవంచ గ్రామాల్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ గ్రామాల శివారు ఆకేరు వాగు(Akeru Vagu) నుంచి రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణ జోరుగా సాగుతుందని పరిసర గ్రామాల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు మూడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను ఈ రెండు గ్రామాల్లో సైతం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.