మనలో ఏ ఒక్కరి జీవితం పరిపూర్ణం కాదని, ప్రతి ఒక్కరు ఏదో ఒక దశలో మానసిక కుంగుబాటుకులోనై ఉంటారని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. మానసిక సమస్యల్ని ఎదుర్కొంటున్న వారికి ఉచితంగా కౌన్సిలింగ్ అందించే ఓ స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంత అతిథిగా పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మనోవ్యాకులతకు గురైన వాళ్లు సమస్యల్ని చెప్పుకోలేకపోతారు. తమలో తామే మథనపడుతుంటారు. అలాంటి పరిస్థితుల్ని నేను దాటి వచ్చాను కాబట్టి మనోవేదన తాలూకు సంఘర్షణ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. ఇలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో మానసిక సమస్యల నుంచి విముక్తులం కావొచ్చు’ అని సమంత చెప్పింది. ప్రస్తుతం ఆమె కెరీర్‌పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ‘యశోద’ చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో రెండు చిత్రాలున్నాయి.