కాలిఫోర్నియా: టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఏడాది తక్కువ జీతాన్ని తీసుకోనున్నారు. ఆయనకు రావాల్సిన జీతంలో 40 శాతం కోత విధించారు. తన జీతాన్ని తగ్గించాలని టిమ్ కుక్‌నే కోరినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది టిమ్ 100 మిలియన్ల డాలర్లు ఆర్జించారు. 62 ఏళ్ల కుక్ గత ఏడాది 99.4 మిలియన్ల డాలర్ల పరిహారాన్ని తీసుకున్నారు. దీంట్లో 3 మిలియన్ల డాలర్ల బేస్ శాలరీ ఉంది. ఇక 83 మిలియన్ల డాలర్ల స్టాక్ అవార్డులు, బోనస్ ఉన్నాయి.
జీతం కోత వల్ల ఈ ఏడాది టిమ్ కుక్ 49 మిలియన్ల డాలర్లు తీసుకోనున్నారు. షేర్‌హోల్డర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా జీతాన్ని ఫిక్స్ చేయనున్నారు. కుక్ కూడా జీతం తగ్గింపు కోసం రికమండ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. కుక్కు ఇవ్వాల్సిన 49 మిలియన్ల డాలర్ల పరిహారంలో.. 3 మిలియన్ల డాలర్ల శాలరీ, ఆరు మిలియన్ల డాలర్ల బోనస్‌తో పాటు 40 మిలియన్ల డాలర్ల ఈక్విటీ కలపనున్నారు.