పాన్ఇండియా స్టార్ ప్రభాస్ మళ్లీ తన ‘బాహుబలి’ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది. ‘బాహుబలి’ రెండు భాగాల సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్. ‘బాహుబలి’ తర్వాత అంతటి భారీ చిత్రాలే చేయాల్సినంత ఇమేజ్ ఏర్పడింది. దానికి తగినట్లే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి చిత్రాలను ఎంచుకుంటున్నారు ప్రభాస్. ఈ క్రమంలో ఆయన చేస్తున్న కొత్త సినిమా ‘సలార్’. ఈ సినిమా గురించి తాజా వార్త ఒకటి బాగా ప్రచార మవుతున్నది. అదేంటంటే ‘బాహుబలి’ సినిమాలాగానే ‘సలార్’ కూడా రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటందనే ఆలోచనలో ఉన్నారట. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్’ సినిమాను హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్నది. శృతిహాసన్ నాయికగా నటిస్తున్నది. యాక్షన్ , హీరోయిజం నేపథ్యంలో రూపొందుతున్న ‘సలార్’ సినిమా కథా విస్తృతి దృష్ట్యా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేశారు ప్రభాస్. ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా… ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె, సందీప్ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు చర్చలు జరుగుతున్నాయి.