అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం (Election Commission) వ్యవహారంపై వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna reddy) మండిపడ్డారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సంఘంపై తమకు అపార గౌరవముందని అన్నారు.
కూటమి నాయకులు ఫిర్యాదు చేయగానే విచారణ చేపట్టకుండానే 29 మంది పోలీసు, ఇతర అధికారులను బదిలి చేసిందని తప్పుబట్టారు. వారంరోజుల ముందు డీజీపీ (DGP) ని మారిస్తే ఎలా ప్రశ్నించారు. కూటమికి సంబంధించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పోలీసు అబ్జర్వర్‌గా పెట్టడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. శాంతి భద్రతలపై పట్టున్న అధికారులను పక్కన పెట్టి , రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలకు కారకులయ్యారని ఆరోపించారు. ఏపీ ఎన్నికల్లో పక్షపాత ధోరణి అవలంభించిందని ఆరోపించారు.
ఎన్నికల సంఘానికి సర్వాధికారాలు ఉన్నా వాటిని దుర్వినియోగం చేసే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశముందని వెల్లడించారు. పోలింగ్ అనంతరం ఓటమి భయంతో కూటమి నాయకులు రాజకీయ కక్షతో వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్న పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం వెనుక అనుమానాలున్నాయని అన్నారు.