e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 1, 2021
Home News సాజిద్ సాగు భళా..!

సాజిద్ సాగు భళా..!

  • సేంద్రియ ఎరువులతో తీరొక్క పంట సాగు
  • ఆదర్శంగా నిలుస్తున్న రసూలాబాద్‌కు చెందిన రైతు
  • రోజు వారీ ఆదాయం భలే బాగు

రసూలాబాద్‌కు చెందిన రైతు సాజిద్‌ అలీ మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి తన ఐదెకరాల్లో కూరగాయలను సాగు చేస్తూ, వాటిని విక్రయించగా, రెండు రోజులకొక్కసారి రూ. 2 వేలు ఆర్జిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సుమారు 30 ఏండ్లుపాటు సౌదీలో ఉన్న సాజిద్‌, వ్యవసాయంపై మక్కువతో తన వ్యవసాయక్షేత్రంలో చిన్న ఇల్లు నిర్మించుకొని సాగు చేస్తున్నాడు. రసాయనిక ఎరువులను ఉపయోగించకుండా, తానే స్వయంగా వర్మీ కంపోస్ట్‌ను తయారు చేసిపసేంద్రియ పద్ధ్దతిలో సాగు చేస్తూ.. అధిక లాభాలు గడిస్తున్నాడు.

కొమురవెల్లి, నవంబర్‌ 24 : మామూలుగా చాలా మంది రైతులు.. రెండు మూడు కూరగాయలు పెట్టి ఒక్కసారి లాభాలు ఆర్జించి మరోసారి నష్టాల పాలవుతుంటారు. రసూలాబాద్‌కు చెందిన సయ్యద్‌ సాజిద్‌ అలీ మాత్రం తనకున్న 5 ఎకరాల్లో 4 ఎకరాలు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న బ్లాక్‌రైస్‌, నవరైస్‌, తెలంగాణ సోనాతోపాటు రాజుల కాలం నాటి కుజుపడారి పంటలను సాగు చేయడమే గాక, మిగిలిన స్థలంలో క్యాప్సి కం, టమాట, మిర్చి, కాకర, చిక్కుడు, గోరు చిక్కుడు, బెండు, బీర, సోరకాయ, తీగజాతి బీర్నీస్‌, కాలీఫ్లవర్‌ వంటి 14 రకాల కూరగాయలను సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్నాడు. అన్ని రకాల కూరగాయలు పండిస్తున్న సాజిద్‌కు మంచి ఆదాయం వస్తున్నది. రెండు రోజులకోసారి రూ.2 వేల ఆదాయం సంపాదిస్తున్నాడు. అది కూడా ఎలాంటి ట్రాన్స్‌పోర్టు చార్జీలు లేకుండా, పట్టణవాసులు తన వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చి కూరగాయలు తీసుకువెళ్తుండటం సాజిద్‌ బాయి కూరగాయలకు ఉన్న క్రేజ్‌ చెబుతున్నది.

- Advertisement -

వ్యవసాయం అంటే చాలా ఇష్టం

నా పిల్లలు అమెరికా నుంచి ఫోన్‌ చేసి నాన్న ఆ ఊర్లో ఏమున్నది హైదరాబాద్‌లో ఉండొచ్చుగా అంటారు. నాకు ఊరు అంటేనే ఇష్టం బేటా అని చెబుతా.. ఎందుకంటే నాకు ఈ వాతావరణం అంటే అమితమైన ఇష్టం. వ్యవసాయమంటే.. అందరి లాగా, కాకుండా కొంచెం వెరైటీగా చేయాలనేది నా ఆలోచన. అందుకే నలుగురిలో ఆదర్శంగా ఉండాలనే అధునాతన పద్ధ్దతిలో సాగు చేస్తున్నా. అధిక లాభాలతో, ఆరోగ్యం సైతం బాగుంటుంది. ఎవరైనా నాదగ్గరికి వచ్చిన వారికి ఆర్గానిక్‌ వ్యవసాయంపై సలహాలు అందిస్తుంటాను.

  • సయ్యద్‌ సాజిద్‌ అలీ, రైతు, రసూలాబాద్‌

అధునాతన పద్ధతిలో సాగు.. అధిక దిగుబడి

ప్రభుత్వం సూచించిన వెదజల్లే పద్ధ్దతిని అవలంభించి, రెండు ఎకరాల్లో 90 బస్తాల ధాన్యాన్ని పండించాడు. అది కూడా ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం తాను తయారు చేసిన సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడి సాధించడం గమనార్హం. మల్చింగ్‌ షీట్‌ ద్వారా కూరగాయలను పండిస్తూ మన ప్రాంతంలో ఎవరూ ఉపయోగించని క్రాప్‌ కవర్స్‌(మైక్రో టన్నల్‌) ను పొద్దున, సాయంత్రం కూరగాయలపై కప్పుతూ అధునాతన సాగు చేస్తున్నాడు. చిన్న మల్టీ ట్రాక్టర్‌ యంత్రంతో కూరగాయల మధ్యలో గడ్డిని తొలిగిస్తూ, కూలీల కొరతను అధిగమిస్తున్నాడు. ఇతర రైతులకు ఆదర్శంగా మారాడు.

సొంతంగానే ఎరువుల తయారీ..

తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్న వివిధ రకాల పంటలకు సాజిద్‌ ఎలాంటి రసాయనిక ఎరువులను ఉపయోగించం లేదు. తానే స్వయంగా వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తున్నాడు. అల్లం, ఎల్లిగడ్డ సమానంగా 2 కిలోలు, ఘాటు మిర్చి 2 కిలోలు, పొగాకు 2 కిలోలు తీసుకొని వాటిని 20 లీటర్ల నీటితో 3 పొంగులు వచ్చే వరకు పొయ్యిపై పెట్టి తర్వాత వడపోస్తే తయారైన ద్రావణాన్ని 20 లీటర్ల నీటితో ఒక లీటరును కలిపి సేంద్రియ ఎరువును తయారు చేసి వాటిని పంటలకు ఉపయోగిస్తాడు. ఇలా చేయడంతో అధిక దిగుబడిని సాధిస్తూ ప్రకృతి వ్యవసాయంపై తనకున్న మక్కువను చాటుకుంటున్నాడు.

రసూలాబాద్‌ టూ హైదరాబాద్‌ వయా సౌదీ..

సయ్యద్‌ సాజిద్‌ అలీ చిన్నప్పుడే రసూలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి వ్యాపార నిమిత్తం సౌదీకి వెళ్లాడు. సుమారు 30 ఏండ్లపాటు సౌదీలో ఉన్న సాజిద్‌, హైదరాబాద్‌లో సకల హంగులతో ఉన్న ఇంట్లో ఉండకుండా వ్యవసాయంపై ఇష్టంతో రసూలాబాద్‌లోని తన వ్యవసాయక్షేత్రంలో ఇల్లు నిర్మించుకొని భార్య ఫరీనాతో అక్కడే ఉంటున్నాడు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడగా, సాజిద్‌ మాత్రం తనకు పట్నం కంటే పల్లెటూరే మక్కువ అం టూ వ్యవసాయంపై తన అభిమానాన్ని చూపిస్తున్నాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement