హైదరాబాద్ : తల్లిని చంపిన దత్తపుత్రుడు తన స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నెల 7వ తేదీన దిల్సుఖ్నగర్లో భూదేవి(52) అనే మహిళ హత్యకు గురైన విషయం విదితమే. తల్లి భూదేవిని దత్త పుత్రుడు సాయితేజ తన ఫ్రెండ్ శివతో కలిసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్న రూ. 10 లక్షల నగదు, 35 తులాల బంగారం తీసుకొని పరారీ అయ్యారు.
నల్లమల్ల అడవుల్లోని మల్లెలతీర్థం వద్ద ఓ యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పరిశీలించగా సాయితేజ డెడ్ బాడీగా నిర్ధారించారు. సాయితేజను బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని మల్లెలతీర్థం నీటి గుండంలో పడేశారు. అయితే సాయితేజను శివనే చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. శివను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.