Sailesh Kolanu | తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన హిట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు శైలేష్ కొలను. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘హిట్ 3’ సూపర్ హిట్ అవ్వడంతో ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా హిట్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడిన శైలేష్ తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. “నాకు #HIT4 కోసం కొన్ని అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయి. అంతేకాకుండా, ఒక మంచి రొమాంటిక్ కామెడీ సినిమాను కూడా తెరకెక్కించాలని అనుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం ‘హిట్ 4’ కథాంశంపై ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని దీనిని పూర్తి స్క్రిప్ట్‌గా అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. పూర్తిగా రచనపై దృష్టి పెట్టడానికి తన కుటుంబంతో కలిసి త్వరలో సిడ్నీకి వెళ్లాలని అలోచిస్తున్నట్లు శైలేష్ తెలిపాడు.
‘హిట్’ (2020), ‘హిట్ 2’ (2022), ‘హిట్ 3’ (2025) వంటి ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలతో శైలేష్ తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. విశ్వక్ సేన్, అడివి శేష్, నాని వంటి హీరోలతో ఆయన రూపొందించిన ఈ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కథనం, పాత్రల తీర్చిదిద్దడంలో శైలేష్ ప్రత్యేక శైలిని కలిగి ఉన్నారు. ఇప్పుడు #HIT4 కోసం సరికొత్త ఆలోచనలతో ఆయన సిడ్నీ ప్రయాణం కావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. హిట్ సిరీస్‌లోని గత చిత్రాలు అందించిన థ్రిల్లింగ్ అనుభవం దృష్ట్యా, #HIT4 ఎలాంటి కథాంశంతో వస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, శైలేష్ కేవలం థ్రిల్లర్ జానర్‌కే పరిమితం కాకుండా, తన తదుపరి ప్రయత్నంగా ఒక రొమాంటిక్ కామెడీ సినిమాను తెరకెక్కించాలని యోచిస్తున్నారు. ఇప్పటివరకు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన శైలేష్, పూర్తి భిన్నమైన రొమాంటిక్ కామెడీ జానర్లో తన దర్శకత్వ ప్రతిభను ఎలా చూపిస్తారో చూడటం ఆసక్తికరంగా ఉండనుంది. సిడ్నీలో ఆయన ఈ రెండు విభిన్నమైన స్క్రిప్ట్‌లను ఎలా పూర్తి చేస్తారనేది వేచి చూడాలి.