Sai Kiran |సాయి కిరణ్.. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తు పట్టకపోవచ్చు. నువ్వే కావాలి, ప్రేమించు సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి కిరణ్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యాడు. టాలీవుడ్‌కు ఎన్నో అద్భుతమైన గీతాలు అందించిన లెజెండరీ గాయనీ పి. సుశీల మనవడు ఈ సాయి కిరణ్ కాగా, ఈ విషయాన్ని ఆయన ఏనాడు పెద్దగా బయటపెట్టలేదు. 2000వ దశకంలో ‘నువ్వే కావాలి’ అనే ప్రేమకథా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయి కిరణ్, ఆ తర్వాత ప్రేమించు, మనసుంటే చాలు, ఎంత బావుందో వంటి సినిమాల్లో కథానాయకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనంతరం కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు బుల్లితెరపై సాయికిరణ్ మంచి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం వంటి పాపులర్ సీరియల్స్‌లో అతని పాత్రలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. నటనలో పరిపక్వతతో బుల్లితెర ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్నాడు. సాయికిరణ్ 2010లో వైష్ణవి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ వారి వైవాహిక జీవితం సరిగ్గా సాగకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కోయిలమ్మ సీరియల్లో తనతో కలిసి నటించిన స్రవంతిని పెళ్లాడాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హ్యాపీగా జీవిస్తున్నారు.గతేడాది డిసెంబర్ లో వారిద్దరి వివాహం కాగా, తాజాగా స్రవంతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించడంతో, పలువురు ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 46 ఏళ్ళ వయసులో సాయి కిరణ్ తండ్రి ప్రమోషన్ అందుకోబోతున్నాడు. గతంలో సాయి కిరణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. నేను లెజెండరీ సింగర్ పి.సుశీల గారి మనవాడిని నిజమే.. కానీ ఆమె నాకు నాన్నమ్మ అని బయట చెప్పుకోవడం నాకు పెద్దగా నచ్చదు. నన్ను నేను ఎలా ఉన్నానో, నా పనితోనే గుర్తించాలి. వారి పేరును వాడుకుని గుర్తింపు పొందడమంటే నాకు ఇష్టం లేదు” అని వ్యాఖ్యానించాడు. సంగీత కుటుంబానికి చెందినవాడైన సాయి కిరణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవాలన్న తపన అతనిలో స్పష్టంగా కనిపిస్తోంది.