
ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు.. పెరుగుతున్న నిధులు
50 లక్షల మందితో మొదలు.. తాజాగా 66 లక్షల మందికి
ఆర్వోఎఫ్ఆర్ భూముల రైతులకు పెట్టుబడి సాయం
సీజన్‌కు ముందే అన్నదాతల ఖాతాల్లో సొమ్ము జమ
హైదరాబాద్, జనవరి 1 : రైతుల సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం ఇంతై ఇంతింతై అన్నట్టుగా ఎదుగుతున్నది. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దాంతోపాటు రైతుబంధు నిధుల కేటాయింపు కూడా పెరుగుతున్నది. రైతుబంధు పథకం ప్రారంభించిన 2018-19 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగేండ్లలో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఈ పథకం కోసం తొలి సీజన్‌తో పోల్చితే ప్రస్తుత సీజన్లో రూ.2,400 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ ఒక్క పథకం ద్వారా నాలుగేండ్లలో ఏకంగా రూ.50,680 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటం గమనార్హం. రైతుబంధు ప్రారంభమైన తొలి ఏడాది 2018-19లో వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి ప్రభుత్వం రూ.10,488 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది వానకాలంలో 147.21 లక్షల ఎకరాలు కాగా, యాసంగిలో అది 153.00 లక్షల ఎకరాలకు పెరిగింది. లబ్ధిదారుల సంఖ్య కూడా ఇదే విధంగా పెరుగుతున్నది. ఈ ఏడాది వానకాలంలో 60.84 లక్షల మంది రైతులు ఉండగా, యాసంగిలో ఆ సంఖ్య 66.61 లక్షలకు పెరిగింది. అంటే ఒక్క సీజన్లోనే ఏకంగా 5.77 లక్షల మంది పెరగడం గమనార్హం. ప్రతియేటా రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం వెనుకంజ వేయకుండా సీజన్‌కు ముందే రైతుల ఖాతాల్లో ఠంచనుగా నిధులను జమ చేస్తున్నది.

అటు కాళేశ్వరం… ఇటు ధరణి
కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్‌తో అటు సాగునీటి కష్టాలు, ఇటు భూ సమస్యలు పరిష్కారమై లక్షల ఎకరాల్లో భూమి కొత్తగా సాగులోకి వచ్చింది. ఆర్వోఎఫ్ఆర్ పరిధిలోని భూములకు కూడా రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సీజన్లో 3.05 లక్షల ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ భూములను జాబితాలో చేర్చి 94 వేల మంది రైతులకు రైతుబంధు అందేలా చర్యలు తీసుకొన్నారు. కాళేశ్వరం, ధరణితోపాటు ఆర్వోఎఫ్ఆర్ భూములతో కలిపి భారీగా సాగు భూమి అందుబాటులోకి వచ్చింది. రైతుబంధు ప్రకారం 2018 వానకాలంలో 130.91 లక్షల ఎకరాల భూమి ఉంటే ఈ ఏడాది యాసంగిలో అది 153.00 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కొత్తగా 22.09 లక్షల ఎకరాల భూమి అందుబాటులోకి రావడం గమనార్హం.
గుంట భూమీ.. గుండెకు ధైర్యం
రైతుబంధులో లబ్ధిదారుల సంఖ్య పెరగడానికి రైతుబంధుతోపాటు రైతుబీమా పథకం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఈ రెండు పథకాలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుండటంతో కుటుంబంలో భూ బదలాయింపు పెరిగింది. రైతుల పేరుపై గుంట భూమి ఉన్నా గుండెకు ధైర్యంగా ఉంటున్నది. దీంతో ప్రతి కుటుంబంలోని అందరి సభ్యుల పేరుపై ఎంతో కొంత భూమి ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఒకరిద్దరి పేరుపై ఉన్న భూమిని అందరిపై రిజిస్ట్రేషన్ చేయించుకొంటున్నారు.
లాగోడికి చేయి చాపాల్సిన పన్లేదు
‘కేసీఆర్ సార్ పసల్, పసల్కు ఇత్తన్న పైసలు లాగోడికి అక్కరకు అత్తన్నయ్. అప్పట్ల ఎవుసం పనులు మొదలువెట్టేటప్పుడు లాగోడికి శానా తిప్పలు పడేటోళ్లం. పైసలు ఉన్నోళ్ల దగ్గరికి పోయి అయ్యా బాంచెన్ అని బతిలాడి తెచ్చుకునేటోళ్లం. కొందరైతే మాతోటి ఆల్ల ఇంట్ల పనులు చేయించుకొని మంచిగ ఉంటెనే పైసలు ఇచ్చేటోళ్లు. కేసీఆర్ సారు అచ్చినంక ఆ బాధలన్నీ పోయినయ్. నాకు మూడెకరాలున్నది. దానికి పసల్కు రూ.15 వేలు అత్తునయ్. ఆటితోటే ఇత్తునాలు, మందు బస్తాలు తెచ్చుకొంటున్న. కరంట్ మోటర్‌కు ఏమన్నైతే మంచిగ చేయించుకుంటన్న. నీళ్లు పారడానికి పైపులు తెచ్చుకున్న. కైకిలోళ్లకు అక్కరకత్తన్నయ్. పనులు మొదలువెట్టేటప్పుడే టంచన్గ పైసలు ఏత్తండు. కేసీఆర్సారు నిజంగ రైతులకు దేవుడే. ఏ కట్టం రాకుండా సౌలతులు జేస్తున్నడు.
-తిరుమని కొమురయ్య, నాంసానిపల్లి, పెద్దపల్లి జిల్లా