Spirit | మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, ఇదే ఏడాదిలో మరో భారీ ప్రాజెక్ట్‌తో థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా విడుదలైన వెంటనే ప్రభాస్, మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. మార్చి నెలలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ మూవీ సెట్స్‌పైకి ప్రభాస్ అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో, సందీప్ రెడ్డి వంగా కనుమ రోజున సడెన్‌గా రిలీజ్ డేట్‌ను ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. 2027 మార్చి 5న ‘స్పిరిట్’ థియేటర్లలోకి రానుంది.
ఈ రిలీజ్ డేట్‌ను యాదృచ్ఛికంగా ఎంపిక చేయలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 5 శుక్రవారం సినిమా విడుదలైతే, వెంటనే మార్చి 6న మహా శివరాత్రి పండగ. ఆ తర్వాత ఆదివారం సెలవు ఉంటుంది. ఆపై కొన్ని రోజుల్లోనే రంజాన్ పండగ, తర్వాతి వారంలో హోలీ, గుడ్ ఫ్రైడే వంటి పండుగలు వరుసగా వస్తాయి. ఈ మొత్తం పండుగ సీజన్‌ను ఉపయోగించుకుంటే, కంటెంట్ బలంగా ఉంటే నెల రోజుల పాటు థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉందని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో సినిమాలకు లాంగ్ రన్ లేకపోవడం ట్రెండ్‌గా మారింది. ఎంత మంచి సినిమా అయినా రెండో వారానికే థియేటర్ల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేసిన దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా ముందుంటాడు. మూడుేళ్ల క్రితం రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ, A సర్టిఫికెట్‌తోనే రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దాదాపు నెల రోజుల పాటు థియేటర్లను షేక్ చేసింది. ఇటీవల రణ్వీర్ సింగ్ నటించిన ‘దురంధర్’ మూవీ కూడా 40 రోజుల తర్వాత కోట్లలో షేర్ సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అయితే ఈ లాంగ్ రన్ ఫార్ములాను ముందుగానే సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఈసారి ప్రభాస్ స్టార్డమ్, పాన్ ఇండియా క్రేజ్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని సందీప్ రెడ్డి వంగా గట్టి ప్లాన్‌లో ఉన్నారట. కొడితే కుంభస్థలం బద్ధలు కావాల్సిందే అన్న ధీమాతో ‘స్పిరిట్’ను రూపొందిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ, ప్రభాస్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.