Kangana Ranaut | బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో మతపరమైన ధోరణులు పెరిగాయంటూ ఇటీవల రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కంగనా, తన ‘ఎమర్జెన్సీ’ సినిమా సమయంలో ఆయన నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఈ సినిమాకు సంగీతం అందించాల్సిందిగా కోరుతూ కథ వినిపించడానికి తాను రెహమాన్‌ను సంప్రదించగా.. ఆయన కనీసం తనను కలవడానికి కూడా నిరాకరించారని ఆమె ఆరోపించారు. ‘ఎమర్జెన్సీ’ ఒక ప్రచార చిత్రం (ప్రొపగాండా) అని భావించి అందులో భాగం కావడానికి ఆయన ఇష్టపడలేదని తనకు తెలిసిందని కంగనా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రెహమాన్‌ను ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఘాటైన విమర్శలు చేస్తూ.. ఆయన కంటే పక్షపాతం చూపే మరియు ద్వేషపూరితమైన వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదని ద్వేషంతో ఆయన కళ్లు మూసుకుపోయాయని విమర్శించారు. తన సినిమాను విమర్శకులు ‘మాస్టర్ పీస్’ అని కొనియాడారని, చివరకు ప్రతిపక్ష నాయకులు సైతం తన సినిమాను మెచ్చుకుంటూ తనకు లేఖలు రాశారని కానీ రెహమాన్ మాత్రం తన పట్ల వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా గురించి కూడా స్పందిస్తూ, గతంలో రామ్ జన్మభూమి దర్శనానికి వెళ్లే సమయంలో మసాబా తనకు చీర ఇవ్వడానికి నిరాకరించిందని, ఆ అవమానాన్ని తట్టుకోలేక తాను కారులోనే ఏడ్చానని కంగనా రనౌత్ వెల్లడించారు.