Russia Ukraine War | కీవ్/మాస్కో, నవంబర్ 21 : రష్యా – ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాలుస్తున్నది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణులతో దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)తో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. ద్నిప్రో నగరాన్ని లక్ష్యంగా చేసుకొని బుధవారం రాత్రి ఈ దాడి జరిగినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. మరో ఎనిమిది ఇతర క్షిపణులతోనూ రష్యా దాడి చేసిందని, వీటిల్లో ఆరు క్షిపణులను కూల్చేశామని పేర్కొన్నది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డట్టు తెలిపింది. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేసేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతి ఇచ్చినందుకు ప్రతిస్పందనగా ఐసీబీఎంను రష్యా వినియోగించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లేలా ఈ ఖండాంతర క్షిపణులను తయారుచేశారు. ఇప్పుడు సాధారణ బాంబుతోనే దాడి చేసినప్పటికీ, అణుదాడి సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకే రష్యా ఈ క్షిపణిని వినియోగించినట్టు స్పష్టమవుతున్నది. కాగా, తాము దాడి చేసింది ఐసీబీఎంతో కాదని, మధ్యశ్రేణి హైపర్సోనిక్ క్షిపణితో దాడి చేసినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని మిలిటరీ కేంద్రంపై దాడి చేసినట్టు చెప్పారు. రష్యాకు వ్యతిరేకంగా వాడే ఆయుధాలు కలిగిన ఏ దేశం మిలిటరీ కేంద్రంపై అయినా దాడి చేయగలమని ఆయన హెచ్చరించారు.
ఉక్రెయిన్ సైతం రష్యాపై దాడులు ముమ్మరం చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వినియోగానికి అమెరికా, యూకే అనుమతించడంతో ఆయా దేశాల్లో తయారైన క్షిపణులతో రష్యాపై దాడికి దిగుతున్నది. ఇప్పటికే అమెరికాలో తయారైన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను వినియోగించిన ఉక్రెయిన్.. బ్రిటన్‌లో తయారైన రెండు ‘స్టార్మ్ షాడో’ క్షిపణులతో గురువారం రష్యాపై దాడి చేసింది. ఈ రెండు క్షిపణులతో పాటు ఆరు హిమార్స్ రాకెట్లు, 67 డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
ఒకవైపు రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రమవుతుండగా, మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొన్ని రోజులుగా బయటకు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. 72 ఏండ్ల పుతిన్ గత 13 రోజులుగా బయటకు కనిపించడం లేదు. నవంబరు 7 నుంచి జరిగిన ఏ కార్యక్రమానికీ ఆయన హాజరుకాలేదు. దీంతో ఆయన ఆరోగ్యంపై వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం పుతిన్‌కు సాధారణ వైద్య చికిత్స జరుగుతున్నట్టు రష్యాకు చెందిన మీడియా సంస్థ ఏజెంట్స్వో వెల్లడించింది. క్యాన్సర్, పార్కిన్సన్స్ వ్యాధులతో పుతిన్ బాధపడుతున్నారని గత కొన్నేండ్లుగా ప్రచారాలు ఉన్నాయి.