Russia Oil : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇండియా చమురు కొరతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాకు మరింత చమురు సరఫరా చేయాలని రష్యా నిర్ణయించింది. ఆయిల్, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) సరఫరాను పెంచబోతున్నట్లు రష్యా శుక్రవారం ప్రకటించింది. రష్యా మొదటి డిప్యూటీ ఛైర్మన్ డెనిస్ మాంటురోవ్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీతో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా చమురు సరఫరాపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భారత అవసరాలకు సరిపడా చమురును అందించే సత్తా రష్యన్ కంపెనీలకు ఉందని, చమురు ఉత్పత్తి పెంచుతామని డెనిస్ అన్నారు. ఈ అంశంపై ఇండియాలోని రష్యన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం.. రష్యా గత ఏడాది చివరినాటికి మినరల్ ఫెర్టిలైజర్స్ సరఫరాను 40 శాతం పెంచింది. భవిష్యత్తులో భారత అవసరాలకు అనుగుణంగా మరింత పెంచేందుకు సిద్ధంగా ఉంది. అణుశక్తి అంశంలో రష్యా, ఇండియా తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీనిలో భాగంగానే కుడంకులామ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం పవర్ యూనిట్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా యూరియా ఉత్పత్తి ప్రాజెక్టును ప్రారంభించబోతున్నాయి. అణుసహకారంలో కూడా ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. పరిశ్రమలు, అంతరిక్షం, విద్య, ఇన్నోవేషన్, వాణిజ్యం, టెక్నాలజీ, ఖనిజాలు వంటి అంశాల్లో కూడా రెండు దేశాలు మరింతగా కలిసి పని చేయాలని నిర్ణయించాయి.