Sprouts | మొలకలు (స్ప్రౌట్స్) ఆరోగ్యకరమైన ఆహారంగా చాలా కాలంగా మంచి పేరు సంపాదించుకున్నాయి. సలాడ్లు, చాట్స్, బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్‌లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎక్కువగా ముడిగా తింటేనే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది భావిస్తారు. బరువు తగ్గేందుకు, క్లీన్ ఈటింగ్ డైట్లో కూడా స్ప్రౌట్స్‌ను విస్తృతంగా సూచిస్తారు. అయితే ఆహారం ఎంత ముఖ్యమో దాన్ని ఎలా తీసుకుంటామన్నది కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. స్ప్రౌట్స్ పోషకాలను కలిగి ఉన్నప్పటికీ, ప్రతిరోజూ ముడిగా తినడం మంచిది కాకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముడి మొలకలు తినడంలో ఒక ముఖ్యమైన సమస్య బ్యాక్టీరియా ప్రమాదం. మొలకలు వేడి, తేమ ఉన్న వాతావరణంలో పెరుగుతాయి. ఇదే పరిస్థితులు ఈ.కోలి, సాల్మొనెల్లా వంటి హానికర బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలంగా ఉంటాయి.
మొలకలు తయారీ సమయంలో కలుషితం అయితే ఈ బ్యాక్టీరియా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం నీటితో కడగడం వల్ల ఇవి పూర్తిగా తొలగిపోవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మొలకలను తేలికగా ఆవిరి పట్టించడం లేదా వేయించడం ద్వారా తినడం సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు. స్ప్రౌట్స్‌ను ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంగా చాలా మంది భావిస్తారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదని కూడా నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల స్ప్రౌట్స్‌లో కేవలం 3-4 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇది ఇతర ప్రోటీన్ వనరులతో పోలిస్తే తక్కువ. అందువల్ల స్ప్రౌట్స్‌ను ప్రధాన ప్రోటీన్ వనరుగా కాకుండా, ఉపాహారంగా మాత్రమే తీసుకోవడం మంచిది. సరైన ప్రోటీన్ కోసం పప్పులు, పనీర్, గుడ్లు, టోఫు, శనగలు వంటి ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా ముడి మొలకలు జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపవచ్చు. వీటిలో అధికంగా ఫైబర్, ఫెర్మెంటబుల్ కార్బొహైడ్రేట్లు ఉండటం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు రావచ్చు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారికి లేదా IBS వంటి సమస్యలు ఉన్నవారికి ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక మొలకలను తేలికగా వండి తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతాయి.
మొలకలను నిల్వ చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల కొంత వరకు తగ్గుతుంది, కానీ పూర్తిగా ఆగదు. అందుకే మొలకలను ఫ్రిజ్‌లో ఉంచి 24 నుంచి 48 గంటల్లోపే ఉపయోగించడం మంచిది. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచితే అవి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. స్ప్రౌట్స్ పోషకాలు ఉన్న ఆహారం అయినప్పటికీ, వాటిని ఎలా తింటామన్నది చాలా ముఖ్యం. ముడిగా కాకుండా తేలికగా వండి తినడం, సరైన విధంగా నిల్వ చేయడం ద్వారా వాటి ప్రయోజనాలను సురక్షితంగా పొందవచ్చని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.