పెద్దపల్లి, మే 31 : త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టనున్నట్టు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విలీన ప్రక్రియకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పకడ్బందీగా చేపట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, కార్మికులు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో పనులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి పొన్నం పరిశీలించారు. అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్టు పేర్కొన్నారు.
కార్మిక సంఘాలకు ఎన్నికలు ముఖ్యం కాదని, ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఆదివారం పెద్దపల్లిలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలను కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్మికులను మభ్యపెట్టేందుకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలపై వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎన్నికల పేరుతో కాలయాపన చేసి, విలీన ప్రక్రియను తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.