హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రగిలిపోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రేవంత్రెడ్డి సర్కార్ తమను మోసగించిందని దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘అపాయింటెడ్ డే’ని ప్రకటిస్తామని చెప్పి రెండేండ్లు గడిచిపోయినా ఎలాంటి ప్రకటన చేయకపోవడం కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేసిన పాపానికి అనుభవిస్తున్నామని నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. ఆర్టీసీలో సమస్యల పరిష్కారం, సంస్థ అభివృద్ధిపై యాజమాన్యానికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు.
2021 నాటి వేతన సవరణను 30% ఫిట్మెంట్తో అమలు చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని, రిటైరైన ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నదని ఆర్టీసీ కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. 2017 పీఆర్సీ ఏరియర్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ డిఫరెన్సులు, ఇతర సెటిల్మెంట్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. రిజెక్ట్ అయిన పీఎఫ్ అప్లికేషన్లు సరిచేయడం లేదని, డీడీలు కట్టిన వారందరికీ పెన్షన్ మంజూరు కావడం లేదని వాపోతున్నారు.
ఆర్టీసీలో చాలా కాలం నుంచి ఎలాంటి ఉద్యోగ నియామకాలు లేక సిబ్బంది తక్కువగా ఉన్నా, ‘మహాలక్ష్మీ’ పథకం అమలుతో తమపై పనిభారం పెరిగినా అన్నీ ఓర్చుకొని సంస్థ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ప్రతిరోజూ దాదాపు 16 గంటలు నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న తమను ప్రభుత్వం ఎలా విస్మరిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
‘మహాలక్ష్మీ’ పథకం అమలుకు సంబంధించిన రూ.2,500 కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆ సొమ్మును వెంటనే ఆర్టీసీకి చెల్లించడంతోపాటు ఇకపై ‘మహాలక్ష్మీ’ పథకం కింద ప్రభుత్వం ప్రతి నెలా ఇవ్వాల్సిన రూ.350 కోట్లను కోత విధించకుండా చెల్లించాలని కోరుతున్నారు. మహిళా ప్రయాణికులకు ‘మహాలక్ష్మీ’ టికెట్ కార్డులు ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటన కార్యరూపం దాల్చకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఆర్టీసీలో కార్మిక సం ఘాలను పునరుద్ధరించాలని, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి ఇచ్చేలా మార్గదర్శకాలు విడుద ల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఈనెల 24న ‘చలో సెక్రటేరియట్’ను విజయవంతం చేస్తామని, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.