హనుమకొండ చౌరస్తా, జూలై 21 : నిత్యం వేలాది మందితో కిటకిటలాడే హనుమకొండ బస్‌స్టేషన్‌లో బస్సులు దిగబడుతున్నాయి. చిన్న వానకే బస్టాండ్ ప్రాంగణమంతా గుంతలుపడి అధ్వానంగా తయారైంది. నీటితో నిండిపోవడంతో బస్సుల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. మురుగుకాల్వల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో బస్టాండ్‌లోని వర్షపు నీరు బయటకు పోకపోవడంతో ఆవరణంతా నిండిపోతున్నది.
కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాల్సిన అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. ఆర్టీసీ అధికారులు ఏటా మరమ్మతుల పేరిట రూ. లక్షల్లో ఖర్చుచేసి తూతూమంత్రంగా పనులు చేయిస్తుండడంతో సమస్యలు పునరావృతమవుతున్నా యి. అసలే ఇరుకుగా మారిన హనుమకొండ బస్‌స్టేషన్ రోడ్లో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో రోడ్లన్నీ జలమయంగా మారి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది. ఇప్పటికైనా అధికారు లు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.