కన్నడ అగ్ర హీరో యశ్ నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ వచ్చే నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఇందులో యశ్ సరసన ఐదుగురు కథానాయికలు నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అదే సమయంలో మోతాదుకు మించిన బోల్డ్ సీన్స్ ఉన్నాయంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఈ వివాదాల నడుమ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేస్తున్నది.
మంగళవారం ‘మనసాగదే..’ (తెలుగు వెర్షన్) అనే రెండో పాటను విడుదల చేశారు. యశ్, తారా సుతారియాలపై ఈ పాటను తెరకెక్కించారు. ‘మనసాగదే..కొనసాగదే..నను నన్నుగా నిలువనీయదే’ అంటూ అందమైన ప్రేమ భావనలతో ఈ పాట సాగింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. నయనతార, కియారా అద్వాణీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యుమా ఖురేషి కథానాయికలుగా నటించారు.