హైదరాబాద్, సెప్టెంబర్ 29: హైదరాబాద్ నుంచి మరో అంతర్జాతీయ రూట్లో విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌ల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించినట్టు జీహెచ్ఐఏఎల్ ప్రకటించింది. వారానికి రెండు రోజులు మాత్రమే నడువనున్న ఈ విమాన సర్వీసు దక్షిణాది నుంచి సెంట్రల్ ఆసియాల మధ్య తొలి డైరెక్ట్ ఫ్లైట్ ఇదే కావడం విశేషం. ఐటీ, బిజినెస్, ఇన్నోవేషన్ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ రూట్లో మరో సర్వీసు అందుబాటులోకి వచ్చినట్టు జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈవో కదిర్ కదిరవన్ తెలిపారు.
మెడికల్ టూరిజం కేంద్రంగా వెలుగొందుతున్న హైదరాబాద్..అంతర్జాతీయ రోగులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నదని, ప్రధానంగా ఇక్కడ అడ్వాన్స్డ్ చికిత్స లభిస్తుండటం, ప్రత్యేక హెల్త్‌కేర్ సర్వీసులు కూడా లభిస్తుండటం ఇందుకు కారణమన్నారు. ఈ నూతన సర్వీసు అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి 27 అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి.