హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : కేంద్రమంత్రి కొడుకు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసుల దర్యాప్తు మందకొడిగా సాగుతున్నదని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. ఈ కేసులో తొమ్మిది రోజుల డ్రామా అనంతరం ఏ1 నిందితుడు భగీరథ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల దాటినా ఏ2, ఏ3 నిందితులపై చర్యలెందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఏ2 సంగప్ప, ఏ3 బండి సంజయ్‌ని ఎందుకు విచారించడంలేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని నిలదీశారు. కనీసం వారికి నోటీసులైనా ఇచ్చారా? అని సందేహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ నేత లు శ్రీనివాస్‌యాదవ్, గోపగాని రఘురాం, సుగురి బాబు, ఈసంపెల్లి రాజుతో కలిసి ఆర్ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. తన కూతురుపై పలుమార్లు లైంగికదాడి జరిగిందని ఓ మహిళ పేట్‌బషీరాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేయగా కేంద్రమంత్రి కొడుకు బండి భగీరథ్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారని గుర్తుచేశారు. ఈ కేసులో సిట్ వేయకుండా డీసీపీ రితిరాజ్‌ను వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని ఆదేశించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ‘బండి సంజయ్.. హైదరాబాద్ పాలు తాగితే ఫీవర్ వచ్చిందని చెప్తున్నదాంట్లో వాస్తవమెం తో తెలియదు. కానీ మీ కొడుకును తొమ్మిది రోజులు దాచిపెడితే తెలంగాణ ప్రజలకు నిజంగానే ఫీవర్ వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పోక్సో కేసులకు చిరునామాగా మారిందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. 2024లో 2103 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శమని ఉదహరించారు. సీఎం రేవంత్‌రెడ్డి శాంతిభద్రతలను గాలికొదిలి భూదందాల్లో మునిగి తేలుతున్నారని ధ్వజమెత్తారు. మే 6న ఖమ్మంలో మహ్మద్‌గౌస్ అనే దుర్మార్గుడు 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నదని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్‌రావు, సునీతాలక్ష్మారెడ్డి బాధితురాలిని పరామర్శించారని తెలిపారు. కానీ బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. కేసీఆర్ పాలనలో మహిళల రక్షణకు ప్రాధాన్యమిచ్చారని, ఇందులో భాగంగా షీటీమ్‌లను ఏర్పాటుచేశారని, భరోసా, సఖీ సెంటర్లు నెలకొల్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందని దుయ్యబట్టారు.
తెలంగాణలో మహిళలు దాడులు, బలాత్కారాలకు గురవుతుంటే స్పందించాల్సిన మంత్రి సీతక్క చోద్యం చూస్తున్నారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఖమ్మం ఘటనపై ఎందుకు స్పందించలేదు? హాస్పిటల్‌కు వెళ్లే తీరికదొరుకలేదా? అని ప్రశ్నించారు. ‘రీల్స్ చేస్తారని బాగా పేరున్న సీతక్కగారూ.. మహిళల భద్రత కోసమూ రీల్స్ చేయండి’ అని చురకలంటించారు. తెలంగాణ కాంగ్రెస్‌ను నమ్ముకొని నామినేషన్ వేసిన మీనాక్షికి సీఎం రేవంత్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.
అఘాయిత్యాలకు గురైన బాలికలపై ఆ ప్రభావం 30 ఏండ్ల వరకు ఉంటుందని ఆర్ఎస్పీ చెప్పారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని కోరారు. 99 శాతం పోక్సో కేసుల్లో నిందితులు తెలిసినవారే ఉంటున్నారని తెలిపారు. బంధువులు, ఇరుగు పొరుగువారు, స్నేహితులు, వాచ్మన్లు, మతగురువుల రూపంలో ఉన్నవారు, సన్నిహితులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు పాటించాలని, గ్రూమింగ్ టెక్నిక్స్ ద్వారా కామాంధులను కనిపెట్టాలని సూచించారు.