హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రాజ్యాంగం పట్ల, ప్రజల ప్రాథమిక హకుల పట్ల నమ్మకం, గౌరవం ఉంటే.. ఇంకా ఏమాత్రం పోలీస్ డిపార్ట్మెంటులో ప్రొఫెషనలిజం మిగిలి ఉందని భావిస్తే, రాష్ట్ర డీజీపీ వెంటనే ముఖ్యమంత్రిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్, )భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టాల ప్రకారం ఎవరికీ మినహాయింపులు లేవని, ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రమే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని, తాను ఇది రాజకీయ కక్షతో చెప్పడం లేదని పేర్కొన్నారు.
‘రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయి’ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి సూచించారని చెప్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో, హరీశ్‌రావు వంటి అగ్రనేతలపై దాడులు జరిగితే పరిస్థితి ఏమిటని నిలదీశారు. సీఎం వ్యాఖ్యలను సామాజిక కోణంలో చూస్తూ.. భర్తలు తమ భార్యాపిల్లలపై, లేదా కిందిస్థాయి ఉద్యోగులు తమ పైఅధికారులపై దాడులు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. గతంలో గజ్వేల్‌లో మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ అగ్రనేతలపై పెట్రోల్ పోస్తామని బహిరంగంగా వ్యాఖ్యానించినప్పటికీ, అప్పటి సిద్దిపేట పోలీస్ కమిషనర్ దీనిపై ఎటువంటి కేసు నమోదు చేయకుండా, పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్) అభిప్రాయం మేరకు దీనిని సివిల్ కేసుగా పరిగణించారని అంటూ.. పోలీస్ యంత్రాంగంపై ప్రవీణ్‌కుమార్ అసహనం వ్యక్తంచేశారు. సంగారెడ్డిలో ఇన్స్పెక్టర్, శౌర్యఅవార్డు గ్రహిత శివకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి టీపీసీసీ నాయకుడు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కనీసం ఆయనకు నోటీసులు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు..
పదవులు శాశ్వతం కాదని, పోలీసులు రాజ్యాంగం పట్ల, ప్రజల ప్రాథమిక హకుల పట్ల (ఆర్టికల్ 21) బాధ్యతగా ఉండాలని ప్రవీణ్‌కుమార్ సూచించారు. చట్టాన్ని సరిగ్గా అమలు చేసి, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డీజీపీని కోరారు. బాధ్యతాయుతమైన పనులు చేయడం ద్వారానే చరిత్రలో నిలిచిపోతారని, రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి ఉండాలని అప్పడే రాజ్యాంగంలోని 311 అధికరణం మిమ్ములను కాపాడుతుందని హితవు చెప్పారు. బీఎన్ఎస్ సెక్షన్ 45ను పరిగణనలోకి తీసుకొని, ముఖ్యమంత్రికి పోలీసులు నోటీసులు జారీ చేయాలని, ఆయన వివరణతో సంతృప్తి చెందకపోతే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ ‘రక్తపు భాష‘ ఆగిపోకపోతే, భవిష్యత్తులో అశాంతి నెలకొంటుందని, అమాయకులు బలి అవుతారని హెచ్చరించారు.