అమరావతి : రాష్ట్రంలో మాముళ్ల దందా నడుపుతున్న మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) పై రౌడీషీట్ ( Rowdy-sheet ) ఓపెన్ చేయాలని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) డిమాండ్ చేశారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై చర్యలు ఉండాలని కోరారు. డీఎస్సీ నిరసనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఎత్తేయాలని శుక్రవారం వైసీపీ నాయకులు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ను కలిశారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ డీఎస్సీ ఆందోళనలో జరిగిన ఘటనలకు సంబంధ లేని వారిపైనా కేసులు పెట్టారని ఆరోపించారు. తమపై కేసులు పెట్టినట్లు చెబితే అక్కడికి వచ్చే విచారణకు హాజరవుతామని, అంతేగానీ ఇళ్ల మీదకు రావొద్దని విజ్తప్తి చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కేసులు పెట్టడం సరికాదని పోలీసులకు సూచించారు. కోర్టులు అక్షింతలు వేసినా పోలీసుల తీరు మారడం లేదని అన్నారు.
ఎస్సీ నేతలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కేసులు పెట్టడం ఆశ్చర్యకరమని అన్నారు. గాదె సాయికృష్ణ కేసులో పోలీసులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ విఫలమైందన్నారు. ఎమ్మెల్సీ ఏసురత్నం మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికల్లో తమ మీద పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. వ్యవస్థల్ని ధ్వంసం చేయాలి అనుకుంటే అది మిమ్మల్ని నాశనం చేస్తుందని అన్నారు.