కల్వకుర్తి రూరల్, ఆగస్టు 19 : కుళ్లిన కూరగాయలు, సరిగా శుభ్రం చేయని చికెన్‌తోపాటు పలు భోజన పదార్థాలు వండిపెట్టి విద్యార్థులను అనారోగ్యం బారిన పడవేస్తారా? మీ ఇంట్లో పిల్లలకు ఇలాగే వండి పెడతారా అంటూ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు ఆనంద్, శారదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, జేపీనగర్ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలను వారు నాగర్‌కర్నూల్ డీఈవో రమేశ్‌కుమార్ కల్వకుర్తి, ఆర్డీవో జనార్దన్‌రెడ్డి పలువురు అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు, లబ్ధిదారులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేసే గుడ్లను పరిశీలించారు.
గుడ్లు కుళ్లిపోయి ఉండడంతో అంగన్వాడీ టీచర్లపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని సూచించారు. అలాగే కల్వకుర్తి పట్టణంలోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను పరిశీలించి అక్కడ విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లో వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు భోజనంలో అందించే కూరగాయలు కుళ్లిపోవడంతో ఇలాంటి కూరగాయలు ఎలా వండిపెడతారు అని ప్రిన్సిపాల్ నాగమణిని ప్రశ్నించారు. కుళ్లిపోయిన కూరగాయలను విద్యార్థులకు భోజనంలో ఇవ్వవద్దన్నారు. అనంతరం విద్యార్థులకు అందించే చికెన్‌ను పరిశీలించగా చికెన్ అపరిశుభ్రంగా ఉందని వాటిని శుభ్రం చేయకుండా ఉంచడంపై అసహనం వ్యక్తం చేశారు. చికెన్ ఇలా ఉంటే ఎలా వండిపెడతారని తద్వారా విద్యార్థులకు వ్యాధులు సోకవా అంటూ ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించారు. ఫ్రెష్‌గా ఉండే కూరగాయలు, ఒకటి రెండు సార్లు పూర్తిగా శుభ్రం చేసిన చికెన్‌తో నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.
అనంతరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించగా పాఠశాలలో బుధవారం మెనూ ప్రకా రం.. విద్యార్థులకు పప్పు, మిక్స్ విజిటబుల్, సాం బార్, గుడ్డు ఇవ్వాల్సి ఉండగా కేవలం సాంబార్ గుడ్డు ఇస్తుండడంతో పాఠశాల హెచ్ఎం బాలునాయక్ వారు ప్రశ్నించారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని ముందుగా టీచర్లు రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు అందించాలనే నిబంధన ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు పాటించకపోవడంపై హెచ్ ఎం ఉపాధ్యాయులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే డీఈవో రమేశ్‌కుమార్‌ని పిలిపించి నిత్యం విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించేలా భోజనాన్ని విద్యార్థులకు అందించే ముందు రుచి చూసిన తర్వాతే వడ్డించాలన్నారు.
అనంతరం జేపీనగర్ ఎస్సీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో అపరిశుభ్రత, మెనూ పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం రూ.కోట్లాది నిధులు కేటాయించి ఖర్చు చేస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాస్థాయి అధికారులు పాఠశాలలను, గురుకులాలను, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయకపోవడం మూలంగా విద్యార్థులకు మెనూ ప్రకారం కాకుండా ఇష్టాను రాజ్యంగా భోజనం అందిస్తున్నారని నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారి వెంట కార్యక్రమంలో తాసీల్దార్ ఇబ్రహీం, ఎంఈవో శంకర్‌నాయక్, సీడీపీవో భాగ్యమ్మ ఉన్నారు.