హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : సనత్‌నగర్‌లోని డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 4 నెలలుగా జీతాలు రావడం లేదని బుధవారం ధర్నా చేపట్టగా.. వారిని గురువారం నుంచి విధులకు హాజరు కావొద్దని ప్రైవేట్ ఏజెన్సీలు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. 780 మంది టిమ్స్‌లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో క్లీనింగ్ సహా ఇతర విధులు నిర్వహిస్తున్నారు. జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేసిన ప్రైవేట్ ఏజెన్సీ కాంట్రాక్టర్ల అగ్రిమెంట్ గత నెల 31తో ముగిసినట్టు సమాచారం.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులు టిమ్స్ లోపల ధర్నాకు దిగడంతో ప్రభుత్వ పెద్దలు ఏజెన్సీలపై సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నామని, నేటి నుంచి టిమ్స్ ఆవరణలో కనిపించొద్దని ఏజెన్సీ నిర్వాహకులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెప్పినట్టు సమాచారం. వేతనాలు అడిగితే ఉద్యోగాల నుంచి తీసేస్తారా? అని కార్మిక సం ఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ ం ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.