సిరిసిల్ల కలెక్టరేట్, సెప్టెంబర్ 11 : చీరల తనిఖీ పేరుతో సిరిసిల్లలోని చేనేత జౌళి శాఖలో పనిచేస్తున్న జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు (జేటీవో) ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని చేనేత, పవర్‌లూం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పంతం రవి ఆరోపించారు. డబ్బులు ఇస్తే సెలెక్ట్ చేస్తున్నారని, లేదంటే రిజెక్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సిరిసిల్ల సుభాష్‌నగర్‌లోని కార్మిక భవన్లో లాల్బాహుటా చేనేత పవర్‌లూం కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలోని కార్మికులు, ఆసాములకు ఉపాధి దొరకాలని ఇందిరా మహిళా స్వశక్తి చీరల పథకాన్ని ప్రవేశపెట్టి, ఈ ఒక ఏడాదికే 8.5 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు. ఉత్పత్తి అయిన వస్త్రం నాణ్యతా ప్రమాణాలు చూడటం కోసం ప్రభుత్వం జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లను నియమించిందని పేర్కొన్నారు.
వారు డబ్బులు ఇచ్చిన వారి వస్ర్తాన్ని సెలెక్ట్ చేస్తూ.. ఇవ్వని వారివి పకనపెట్టి పెడుతున్నారని ఆరోపించారు. 1000 మీటర్ల వస్ర్తాన్ని ఒక ఘట్టాగా చేసి గోదాములోని జేటీవోల దగ్గరికి తీసుకెళ్తారని, ఈ క్రమంలో వారు ఒక ఘట్టాకు రూ.80 నుంచి రూ.100 వసూలు చేస్తున్నారని వాపోయారు. 85,000 ఘట్టాలకు రూ.70 లక్షలు, అదనంగా ఒక మ్యాక్స్ సంఘానికి రూ.15,000 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఏడాదికి జేటీవోలు రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూళ్లకు పాల్పడుతున్నా చేనేత జౌళి శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డబ్బులు తీసుకుని జేటీవోలు నాణ్యత లేని వస్ర్తాన్ని కూడా సెలెక్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు.