హైదరాబాద్, జనవరి 24 : రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులన్నింటికీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేందుకు రోడ్లు, భవనాల శాఖ సిద్ధమైంది. ఇందుకోసం విపత్తుల నిర్వహణ కింద కేంద్రం నయాపైసా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ఇటీవల సొంత బడ్జెట్ నుంచి రూ.1,000 కోట్లు కేటాయించింది. దీంతో ఈ వేసవి కాలం చివరిలోగా పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంతో ఉన్నారు. 32 జిల్లాల్లో 2,937 కిలోమీటర్ల రోడ్లను 510 పనులుగా విభజించి అంచనాలు తయారు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ వారంలోనే పూర్తి కానున్నది. అనంతరం షార్ట్ టెండర్లు పిలిచి, ఫిబ్రవరిలోనే పనులు మొదలు పెట్టనున్నారు. దెబ్బతిన్న రోడ్లలోని పొడి మట్టిని పూర్తిగా తొలగించి అడుగు భాగం నుంచి పటిష్ఠంగా రోడ్డు వేస్తారు. దాదాపు కొత్త రోడ్డు వేసిన విధంగానే ఈ మరమ్మతులు ఉంటాయని అధికారులు చెప్తున్నారు.