హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రిచ్ (రీసెర్చ్ ఇన్నోవేషన్ సెంటర్ ఆఫ్ హైదరాబాద్), బ్రిటిష్ కౌన్సిల్ మధ్య మరిన్ని పరిశోధనలు జరిగేలా తాజా ఒప్పందం దోహదపడుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. బుధవారం తాజ్ కృష్ణలో నిర్వహించిన కార్యక్రమంలో పలు రంగాల్లో పరిశోధనలు, ఇతర విద్యాపరమైన అంశాల్లో పరస్పర సహకారంపై తెలంగాణ ప్రభుత్వ సంస్థ రిచ్, బ్రిటిష్ కౌన్సిల్ల మధ్య మూడేండ్లకు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంవోయూ) కుదిరింది. జయేశ్ రంజన్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సమక్షంలో రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాథన్ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలోని యూనివర్సిటీలు, రీసెర్చ్ సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, స్టార్టప్‌లు అన్నింటిని ఒకే వేదికపైకి తేవడం.. వాటి ద్వారా సంయుక్తంగా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం రిచ్ ముఖ్యోద్దేశం’ అన్నారు. కాగా, బ్రిటన్‌లోని యూనివర్సిటీలు, రీసెర్చ్ సంస్థలకు బ్రిటిష్ కౌన్సిల్ ప్రాతినిథ్యం వహిస్తున్నది. దీంతో ఈ ఎంవోయూ ఎంతో ప్రయోజనకరమన్న జయేశ్ రంజన్.. లైఫ్‌సైన్సెస్, వ్యవసాయం, జెనెటిక్స్సహా అనేక రంగాల్లో ఇకపై రిచ్, బ్రిటిష్ సంస్థలు పనిచేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
ఆఫీస్‌లకు రావాలి: జయేశ్ రంజన్
కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని, ఐటీ కంపెనీలు ఇక మునుపటిలా కార్యకలాపాలు ప్రారంభిస్తే లాభదాయకమని జయేశ్ రంజన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు సంస్థలు పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రం హోంకు గుడ్‌బై చెప్పేశాయని, ఆఫీస్ అటెండెన్స్‌తో పనిచేస్తున్నాయని తెలిపారు.