హైదరాబాద్, మే 15 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఉద్యోగులందరితో సమావేశం, ఎజెండా అంశాలు వెల్లడించకపోవడంపై ఆ శాఖ సెక్రటరీ ఎండీపై సీరియస్ అయినట్టు తెలిసింది. స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక అమలు, సంస్థాగత వృద్ధి వ్యూహాలపై సమీక్షించేందుకు శనివారం ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి సిబ్బంది సమావేశం ఉన్నట్టుగా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి క్షేత్రస్థాయి సిబ్బందితోపాటు ప్రధాన కార్యాలయ ఉద్యోగులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. సమావేశానికి మంత్రి సీతక్కతోపాటు ఆశాఖ సెక్రటరీ, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్ హాజరవుతున్నట్టు తెలిసింది. గ్రామీణ, ఆర్థికాభివృద్ధి దిశగా ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా, 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక ప్రణాళికను అమలుచేయడం ఈ సమావేశం ప్రాథమిక ఉద్దేశమని, దీనిపై సిబ్బంది వినూత్న ఆలోచనలు, సూచనలు ఇవ్వాలని పైకి చెప్తున్నా.. సమావేశం అసలు ఎజెండా వేరే ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
మరోవైపు స్త్రీనిధిలో జరిగే అక్రమాలపై శనివారం ప్రజాభవన్ సమీపంలో ఉస్మానియా వర్సిటీకి చెందిన నిరుద్యోగ విద్యార్థి జేఏసీ ప్రెస్‌మీట్ పెట్టనున్నట్టు ప్రకటించింది. స్త్రీనిధిలో అవినీతి ఆరోపణలు ఎదురొంటూనే, 14 ఏండ్లుగా ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగుతున్న ఎండీ విద్యాసాగర్రెడ్డిపై ఎంక్వయిరీ, జీవో-523 కింద చర్యలు తీసుకోకుండా మళ్లీ ఉద్యోగ కాలం పొడిగించే ప్రక్రియ నడుస్తున్నదని, ఇటీవలి ఉద్యోగ నోటిఫికేషన్లలో రోస్టర్ విధానం, రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూల ద్వారానే నియామకాలు చేపట్టడం, 30 ఏండ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వంటి అంశాలపై ఆధారాలుసహా వివరిస్తామని జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.