Sircilla | సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 15: పోలీసుల పహారా.. రెవెన్యూ అధికారుల హడావుడితో రాజన్న సిరిసిల్ల జిల్లా మండేపల్లి శివారు కేసీఆర్ నగర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం ఉదయాన్నే భారీగా పోలీసులు మోహరించడంతో ఏం జరుగుతుందో తెలియక కాలనీవాసులు కాసేపు ఆందోళనలకు గురయ్యారు. అయితే ఆ వెంటనే రెవెన్యూ, హౌసింగ్ శాఖ అధికారులు చేరుకుని ఇంటింటా సర్వే చేపట్టారు. అప్పుడు ఏం జరుగుతుందో అర్థం చేసుకుని కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1320 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు అందించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ నగర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. కనీసం మౌలిక సదుపాయలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ కాలనీని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కాలనీవాసులు ఏడాదిగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్, ఇతర పార్టీ నాయకులు కూడా అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ ఎటువంటి ముందడుగు పడలేదు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాలో కూడా కేసీఆర్ నగర్ ఓటర్లను ప్రకటించలేదు. గ్రామ ఓటర్ల జాబితాలో ప్రకటించకపోవడంతో ఆ కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు.
ఇలా ఇప్పటికే పలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆదివారం ఉదయం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోలీసుల పహారాలో ఇంటింటి సర్వే నిర్వహించడం చర్చనీయాంశమైంది. సరైన వసతులు లేకపోవడంతో చాలామంది లబ్ధిదారులు సిరిసిల్ల నుంచి కేసీఆర్ నగర్‌కు వెళ్లొస్తున్నారు. పైగా దూర ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకు వెళ్లిన వారు కూడా ఈ విషయం తెలియగానే హడావుడిగా కేసీఆర్ నగర్‌కు చేరుకున్నారు. కానీ అప్పటికే సర్వే ముగిసిందని చెప్పడంతో అయోమయానికి గురవుతున్నారు.